ఈ రోజుల్లో ప్రజలు క్రెడిట్ కార్డుల(Credit Cards)ను విపరీతంగా వాడేస్తున్నారు. బిల్ పేమెంట్స్, షాపింగ్, రీఛార్జ్, సబ్స్క్రిప్షన్ల వంటి వివిధ చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌లపైనే ఆధారపడుతున్నారు.
క్రెడిట్ కార్డులు నిర్దిష్ట కాలానికి వడ్డీ లేకుండా లిమిటెడ్ అమౌంట్‌ను అందిస్తాయి. ఇంటరెస్ట్-ఫ్రీ (Interest-free) ఫెసిలిటీతో పాటు క్యాష్ బ్యాక్ రివార్డ్‌లు, డబ్బు ఆదా చేయడంలో సహాయపడే డిస్కౌంట్ ఆఫర్లను సైతం క్రెడిట్ కార్డ్స్ అందిస్తాయి. వీటికి చాలా మంది ఆకర్షితులవుతూ ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను తీసుకుంటారు.
సరిగ్గా ఉపయోగించినప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డులు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ ఎక్కువ క్రెడిట్ కార్డులను తీసుకొని బిల్లులను సకాలంలో చెల్లించకపోతే, పరిస్థితి దారుణంగా మారుతుంది. భారీగా వడ్డీలను చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు తీసుకోవడం, వాటిని ఇతర బిల్లులకు చెల్లించడం చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెలా సంపాదనలో చాలా వరకు ఈ బిల్లు కట్టడానికే ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు, గడువు తేదీకి ముందు చెల్లింపు చేయడానికి తగినంత క్యాష్ పొందడం కష్టంగా మారవచ్చు. అయితే సొంత డబ్బును ఉపయోగించకుండా, చేతి నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టకుండానే క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించడానికి ప్రత్యామ్నాయ పరిష్కారం ఉంది.
ఒక క్రెడిట్ కార్డు నుంచి మరో దానికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్
సంపాదించిన డబ్బును ఉపయోగించకుండా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించడానికి ఒక మార్గం ఉంది. అదే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. ఒక క్రెడిట్ కార్డు నుంచి మరో దానికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండాలి. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది డబ్బులు ఉన్న ఒక క్రెడిట్ కార్డ్ నుంచి బకాయి ఉన్న మరొకదానికి బ్యాలెన్స్‌ని బదిలీ చేయడం. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, ఒక క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి మరొక క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించడం. ఈ పద్ధతిలో వడ్డీ భారం పడకుండా, అలాగే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టకుండా జాగ్రత్త పడవచ్చు.
ఈ పద్ధతిలో రిస్క్‌లు ఏంటి
క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించడానికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించినప్పుడు, కొన్ని అంశాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మొదటిగా, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది సాధారణ లావాదేవీలతో పోలిస్తే తరచుగా అధిక వడ్డీ రేటును కలిగి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజుల వంటి ఎక్స్ట్రా ఛార్జీలు కూడా ఉండవచ్చు. అందువల్ల, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎంచుకునే ముందు అన్ని సంబంధిత ఖర్చులను అర్థం చేసుకోవడం చాలా కీలకం. అయితే, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రస్తుత క్రెడిట్ కార్డ్‌పై బిల్లును గడువు తేదీలోపు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జీలు లేదా వడ్డీ రేట్లు లేకుండా బయటపడవచ్చు.