ప్రేమికుల దినోత్సవం రోజున దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు.
అంతకుముందు ఆమెపై కత్తితో సైతం దాడికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లా (Annamayya District) గుర్రంకొండలో శుక్రవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. ఆమెకు పెళ్లి నిశ్చయమైందని తెలిసి యాసిడ్ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రేమికుల దినోత్సవం రోజున యాసిడ్ దాడి
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పేరంపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. మదనపల్లిలో డిగ్రీ చదువుతున్న యువతిపై తోటి విద్యార్థి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న యాసిడ్ పోసి దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. యువతి తలపై కత్తి గాయాలు కాగా, యాసిడ్ పడటంతో ముఖంపై కాలిన గాయాలయ్యాయి. నిందితుడిని గణేష్ అని గుర్తించారు. నిందితుుడు మదనపల్లెలోని అమ్మ చెరువు మిట్టకు చెందిన యువకుడిగా సమాచారం. తీవ్ర గాయాలైన యువతిని చికిత్స నిమిత్తం 108లో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతికి వివాహం నిశ్చమైంది. ఏప్రిల్ నెలాఖరులో (29వ తేదీన) ఆమె వివాహం జరగాల్సి ఉంది. కానీ అంతలోనే ప్రేమ పేరుతో ఓ యువకుడు కత్తితో దాడి చేసి, ఆపై యాసిడ్ పోసి హత్యాయత్నం చేశాడని ఆమె కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.