ఏపీ జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు (nimmala ramanaidu) ఏపీలోని మూడు జిల్లాల ప్రజలకు శుభవార్త చెప్పారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పిన మంత్రి నిమ్మల రామానాయుడు నేడు వెలిగొండ ప్రాజెక్టుతో పాటు ఫీడర్ కాలువ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
నల్లమల సాగర్ రిజర్వాయర్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన
ఫీడర్ కాలువ ప్రాంతాన్ని మోటార్ సైకిల్‌పై వెళ్లి పూర్తిగా పరిశీలించిన ఆయన. పనుల నాణ్యత, వేగంపై అధికారులను ఆరా తీశారు.వెలిగొండ ప్రాజెక్ట్‌లో కీలక భాగమైన నల్లమల సాగర్ రిజర్వాయర్‌ను ఈ ఏడాది సాగునీటి సీజన్ ప్రారంభమయ్యేలోగా నింపే లక్ష్యంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
వైసీపీ సర్కార్ ఐదేళ్ళలో చెయ్యలేనిది 50 రోజులలోనే చేశాం: మంత్రి నిమ్మల
తమ ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 6,579 మీటర్ల బెంచింగ్ పనులు, 3,644 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చేయలేని పనులను తమ ప్రభుత్వం కేవలం 50 రోజులలోనే పూర్తి చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల ఈ ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు 90 కోట్ల రూపాయల మేర నష్టపరిహారం విడుదల చేసినట్టు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించిన అనంతరమే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మూడు జిల్లాలలో సాగునీటి సమస్యలకు చెక్
వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమల సాగర్ రిజర్వాయర్ పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని సాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయి. రాయలసీమ ప్రాంతానికి సాగునీటి భద్రత కల్పించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నిమ్మల రామానాయుడు తాజా ప్రకటనతో మూడు జిల్లాల రైతులకు శుభవార్త చెప్పినట్టు అయ్యింది.


































