టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి వస్తువుగా మారింది. పని ఏదైనా సెల్ ఫోన్ లేకుండా పూర్తి చేయడం అసాధ్యం అనే పరిస్థితి ఏర్పడింది.
సాంకేతిక పరిజ్ఞానం అంతలా అభివృద్ధి చెందుతుంటే అంతే వేగంగా దాన్ని దుర్వినియోగం చేసే నేరగాళ్లు పెరిగిపోతున్నారు. తాజాగా శాంసంగ్ ఫోన్లు వాడుతున్న వారికి సైబర్ పరిశోధకులు షాకింగ్ విషయం వెల్లడించారు. శాంసంగ్ కంపెనీకి చెందిన ఫోన్లపై పెద్ద ఎత్తున సైబర్ ఎటాక్ జరిగిందని ఈ తతంగం అంతా కొన్ని నెలల పాటు చాలా గుట్టుగా సాగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఎలాంటి లింకులు ఓపెన్ చేయకుండానే శాంసంగ్ సాఫ్ట్‌వేర్‌లో జీరో-డే లోపాన్ని ఉపయోగించుకుని కేవలం వాట్సాప్ ఫోటోల రూపంలో ల్యాండ్ ఫాల్ స్పైవేర్ జొప్పించి ఫోన్లలోని సున్నితమైన సమాచారం తస్కరించినట్ల కథనాలు పేర్కొన్నాయి.
గెలాక్సీ ఫోన్లు టార్గెట్:
హ్యాకర్లు శాంసంగ్‍లోని గెలాక్సీ ఎస్22, ఎస్23, ఎస్24, జెడ్ ఫోల్డ్ 4, జెడ్ ప్లిప్ 4 ఫోన్లను టార్గెట్ చేశారని భద్రతా నిపుణులు అంచనా వేశారు. దాడి చేసే వారు డిజిటల్ నెగటవి (డీఎన్‍జీ) ఇమేజ్ ఫైల్‍లను ఆయుధంగా చేసుకున్నారని వాటిని సాధారణ జేపీఈజీ ఇమేజ్ ల వలే మారురూపంలో ఉంచి వాట్సాప్, మెసేజింగ్ యాప్‍ల ద్వారా లక్ష్యంగా చేసుకున్న డివైజ్ లకు పంపారు. ఆ ఇమేజ్ రిసీవ్ అయ్యాక సైలెంట్‍గా ఫోన్లను వారి ఆధీనంలోకి తీసుకువెళ్తున్నాయని ఇది టెక్స్ట్ బుక్ జీరో క్లిక్ దాడి అని నిపుణులు చెబుతున్నారు. ల్యాండ్ ఫాల్ వైరస్ ఫోన్‍లోకి ప్రవేశించాక పూర్తి స్థాయిలో గూఢచర్యం చేస్తోందని కాల్ స్నూప్ చేయడం, ఫోటోలు, సందేశాలు స్క్రాప్ చేయడం, కాంటాక్టులు, సంభాషణల రికార్డు, లొకేషన్ ట్రాకింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ ఎటాక్ ఎక్కువగా టర్కీ, ఇరాన్, ఇరాక్, మొరాకోతో సహా మధ్య ప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా విస్తరించినట్లు నిపుణలు అంచనా వేస్తున్నారు. ఈ స్పైవేర్ నెలల తరబడి గుర్తించబడలేదని 2024లో మొదటి సారి గుర్తించబడిందని పరిశోధకులు తెలిపారు. ఈ సమస్య గురించి శామ్సంగ్‌కు సెప్టెంబర్ 2024లోనే సమాచారం అందిందని, కానీ ఏప్రిల్ 2025లోనే ఒక ప్యాచ్‌ను విడుదల చేయడం వల్ల ఈ సమస్య అంతర్గతంగానే పరిష్కరించబడినట్లు తాజాగా పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే శాంసంగ్ తమ ఫ్లాగ్ షిప్ ఫోన్లుగా చెప్పబడుతున్న అగ్రశ్రేణి ఫోన్‌లు కూడా సైలెంట్ గా స్పైకి ఎలా అతీతం కాదో ఈ ఎపిసోడ్ హైలైట్ చేస్తుందని సైబర్ నిపుణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజా కథనాలపై శాంసంగ్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
మీ ఫోన్ స్పైకి గురైందా?
అయితే శాంసంగ్ ఫోన్లు ల్యాండ్ ఫాల్ సైబర్ దాడికి గురైనట్టు కథనాలు వెలువడటంతో తమ ఫోన్లు సేఫేనా అనే ఆందోళన చాలా మంది శాంసంగ్ వినియోగదారులో సందేహం కలుగుతోంది. అయితే ఈ సైబర్ ఎటాక్ పూర్తిగా టార్గెటెడ్‍గా జరిగేవని సాధారణ యూజర్లు బాధితులుగా మారే అవకాశం చాలా తక్కువ అనే అంచనా వేస్తున్నారు. ఈ ఎటాక్ జరిగిన తర్వాత శాంసంగ్ సెక్యూరిటీ ప్యాచ్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 2025 తర్వాత సెక్యూరిటీ ప్యాచ్ అప్ డేట్ అయి ఉంటే మీ ఫోన్ సేఫ్ గానే ఉన్నట్లు అని చెబుతున్నారు. ఇందుకోసం శాంసంగ్ వినియోగదారులు సెట్టింగ్‍లోకి వెళ్లి సాఫ్ట్ వేర్ అప్‍డేట్ ఆప్షన్ లో తనిఖీ చేసుకోవాలని అప్ డేట్ లేకుంటే వెంటనే సాప్ట్ వేర్ అప్ డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.



































