బంగాళాఖాతంలో రెండు రోజులుగా కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం ఉదయానికి మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా బలపడింది.
వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇది ప్రస్తుతం ఒడిశాలో పూరీకి 60 కి.మీ దక్షిణ ఆగ్నేయంగా, గోపాల్‌పూర్‌కు 130 కి.మీ. తూర్పుగా, కళింగపట్నానికి 230 కి.మీ. తూర్పు ఈశాన్యంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం పశ్చిమంగా పయనించి శనివారం ఉదయం కళింపట్నం-పూరీ మధ్య గోపాల్‌పూర్‌కు సమీపంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ తెలిపింది. కాగా తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి కోస్తా, రాయలసీమల్లో మేఘాలు ఆవరించాయి. ఉత్తరకోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ విజయనగరంలో 58.75, ఆమదాలవలసలో 54, శ్రీకాకుళంలో 48.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు
శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కడప, కర్నూలు జిల్లాల్లో భారీవర్షాలు కురవనున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. ఇదిలావుండగా ఈనెల 30 నాటికి అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనుందని, ఆ తర్వాత వాయవ్యంగా పయనించి వచ్చే నెల రెండో తేదీకల్లా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. దీనివల్ల ఉత్తరకోస్తాలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
కొనసాగుతున్న వరద ప్రవాహం
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద 2.39 లక్షల క్యూసెక్కులు, ధవళేశ్వరం వద్ద 5.34లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండటంతో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత కలెక్టర్లతో సమీక్ష చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, ప్రమాదకర ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను కోరారు.
పెరిగిన గోదావరి నీటిమట్టం
పోలవరం నుంచి 7,62,862 క్యూసెక్కులు విడుదల
భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 43.90 అడుగులకు చేరుకుంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 7,62,862 క్యూసెక్కుల వరద జలాలను జలవనరులశాఖ అధికారులు ప్రాజెక్టు 48 గేట్ల నుంచి దిగువకు విడుదల చేశారు.
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద
శ్రీశైలం జలాశయానికి వరద తగ్గముఖం పట్టింది. జలాశయం 10 గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్న జలవనరుల శాఖ అధికారులు శుక్రవారం రెండు గేట్లను మూసివేశారు. 8 క్రస్ట్ గేట్ల స్పిల్‌వే గుండా 2,15,424 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు



































