ఆగ్నేయ బంగాళాఖాతంలో మరోసారి వాతావరణ మార్పులు వేగం పడుతున్నాయి. నవంబర్ 22న ఓ కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశాన్ని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో మరోసారి వాతావరణ మార్పులు వేగం పడుతున్నాయి. నవంబర్ 22న ఓ కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశాన్ని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఈ వ్యవస్థ ముందస్తు అంచనాల ప్రకారం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ, 48 గంటల్లో బలపడి నవంబర్ 24న డిప్రెషన్‌గా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా అదే దిశగా ప్రయాణించి, దక్షిణ–పశ్చిమ బంగాళాఖాతంలో మరింత శక్తిని సంతరించుకునే అవకాశం ఉన్నట్టుగా వాతావరణశాఖ సూచించింది. ఈ వ్యవస్థ పూర్తిగా ఏర్పడిన తర్వాత మరింత ఖచ్చితమైన వివరాలు వెల్లడిస్తామని ఐఎండీ తెలిపింది.
తమిళనాడు–ఏపీ తీర ప్రాంతాలకు ప్రత్యేక హెచ్చరికలు మేలైన విశ్లేషణలు చేసిన స్కైమెట్ వేదర్ సర్వీసెస్ కూడా అల్పపీడనం ప్రభావం తీర రాష్ట్రాలపై స్పష్టంగా చూపవచ్చని హెచ్చరించింది. నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతం సాధారణంగా బలమైన వాయుగుండాలకు అనుకూల పరిస్థితులు కల్పిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు వచ్చే వారం వర్షాలు, ఈదురు గాలులకు సిద్ధంగా ఉండాలని సూచించింది. సాధారణంగా ఈ తరహా వ్యవస్థలు ఏపీ–ఒడిశా వైపు కదిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ దిశగా కూడా తిరుగుతాయని స్కైమెట్ తెలిపింది.
తెలంగాణలో పొడి వాతావరణం – చలిగాలి తీవ్రత పెరుగుదల బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదని అంచనా. రాష్ట్రంలో తక్కువస్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి ప్రవహిస్తున్నాయి. దీని ప్రభావంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొననుంది. అయితే రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముంది. ముఖ్యంగా ఉత్తర మరియు పశ్చిమ జిల్లాల్లో 2–3 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని వాతావరణశాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వేగంగా వీచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి వర్షాలు – తీర ప్రాంతాల్లో జాగ్రత్తలు అవసరం అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, అల్పపీడనం ప్రభావం ఏపీలో కొంతవరకు కనిపించవచ్చు. ఉత్తరాంద్రలో మూడురోజులు పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉన్నప్పటికీ, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. ఒకటి రెండు చోట్ల ఈదురు గాలులు, మెరుపులు సంభవించే అవకాశముందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా వచ్చే రెండు రోజులు చినుకులు లేదా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కూడా పడవచ్చని హెచ్చరికలు జారీ చేశారు.
మొత్తం దృష్టి బంగాళాఖాతంపైనే అల్పపీడనం పూర్తిగా రూపుదిద్దుకున్న తర్వాత మాత్రమే వాయుగుండం తీవ్రత, దాని గమనం, తీరంపై ప్రభావం ఎంతుందో స్పష్టత వస్తుంది. తమిళనాడు, ఏపీ తీర ప్రాంతాలు రానున్న వారం వాతావరణ హెచ్చరికలను ఖచ్చితంగా గమనించాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
































