బందరుకు సమీపంలో తుపాన్-విజయవాడలో 7 గంటల నుంచి ఆంక్షలు

పీలో మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ఇప్పటికే కాకినాడ తీరానికి సమీపంలో వస్తుందని భావించిన తుపాను కాస్తా దిశ మార్చుకుని మచిలీపట్నం(బందరు) తీరానికి సమీపిస్తోంది.


ఈ నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రి ఎట్టి పరిస్ధితుల్లోనూ కాకినాడ-బందరు మధ్య ఇది తీరం దాటడం ఖాయమని అంచనా వేస్తున్నారు. దీంతో తుపాను ప్రభావం ప్రజలపై పడకుండా విజయవాడ నగరంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

విజయవాడ నగరంపై మొంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఈ తుపాను కారణంగా విజయవాడ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో నగరంలో ప్రజలు రోడ్లపైకి రాకుండా, అలాగే భారీ వాహనాలు కూడా నగరంలోకి రానివ్వకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఇవాళ సాయంత్రం నుంచే ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి.

విజయవాడలో సాయంత్రం 7 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో నగరంలో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయబోతున్నారు. నగర పరిధిలో ఎక్కడ వాహనాలు రోడ్ల పైకి రాకుండా చూడాలని పోలీసులకు అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

సాయంత్రం 7 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజలు రోడ్ల పైకి రాకుండా చూడాలని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు అందాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి తుపాను తీరం దాటినా దాని ప్రభావం రేపు సాయంత్రం వరకూ ఉండే అవకాశం ఉంది. దీంతో అప్పటివరకూ ఈ ఆంక్షలు అమలు కావచ్చని అంచనా వేస్తున్నారు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.