ఉద్యోగులకు డీఏ – రైతు బీమా అమలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 6న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎన్నికల హామీలతో పాటుగా పాలనా పరంగా కొత్త నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు.


అందులో భాగంగా ఈ సారి సమావేశంలో ఉద్యోగుల అంశాల పైన చర్చ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం 8వ పీఆర్సీ కమిషన్ పై నిర్ణయం తీసుకోవటం తో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన తో పాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల పైన చర్చించనున్నారు.

ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న సచివాలయంలో జరిగే భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో పాటుగా ఏపీలో పెట్టుబడుల పైన జరిగిన చర్చల గురించి వివరించే అవకాశం ఉంది. అదే విధం గా పారిశ్రామిక ప్రోత్సాహకాలు, అమరావతి నిర్మాణం, పోలవరం డయా ఫ్రమ్‌వాల్‌ నిర్మాణం పైనా చర్చించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రవేశ పెట్టే బడ్జెట్ పైన చర్చించి.. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైనా నిర్ణయం తీసుకోన్నారు.

ఉద్యోగులకు డీఏ

ఇక, ఏపీలో వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం పన చర్చించి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఈ సారి సమావేశంలో ఉద్యోగుల అంశాల పైన కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగుల కు దాదాపు రూ 26 వేల కోట్ల మేర వివిధ చెల్లింపులు బకాయి ఉన్నాయి. అందులో కొంత మేర చెల్లించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. పెండింగ్ డీఏల పైన ఈ సమావేశంలో చర్చించటంతో పాటుగా ఒక విడత చెల్లింపుకు ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా పీఆర్సీ ఏర్పాటు పైన చర్చ ఉంటుందని భావిస్తున్నారు.

అన్నదాత సుఖీభవ నిధులు

అదే విధంగా కూటమి అధికారంలోకి వస్తే రైతు భరోసా నిధులు రూ 20 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీ అమలు ముహూర్తం ఖరారు చేయనున్నారు. తాజాగా ఈ పథకం కింద ఎంత మంది రైతులకు నిధులు జమ చేయాల్సి ఉంటుందనే లెక్కలు తేల్చింది. కాగా, కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ తో కలిపి ఈ పథకం నిధులు జమ చేయాలని భావిస్తోంది. వచ్చే నెలలో అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

ఖాతాల్లో నిధుల జమ తాము అధికారంలోకి వస్తే ప్రతీ రైతుకు ఏటా రూ 20 వేలు చొప్పున ఆర్దిక సాయం చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. గతంలో రతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకానికి ‘అన్నదాతా సుఖీభవ’ గా పేరు మార్చారు. ఫిబ్రవరిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేలా ముహూర్తం ఫిక్స్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అమ్మఒడి వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేయనున్నారు. దీంతో, ఈ కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.