అదిరిందయ్యా వైష్ణవ్!

– అధికారి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి..- ఆయన పట్టిందంతా బంగారమే
– లక్ష రూపాయల పెట్టుబడితో కోట్లాది రూపాయల ఆదాయం
– అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు చేయూత


– ‘న్యూస్లాండ్రీ’ విశ్లేషణాత్మక కథనం
న్యూఢిల్లీ: అదృష్టం కాదు అది! బీజేపీ పాప్రకంలో పెరిగిన ఒక క్రోనీ క్యాపిటలిస్టు కమ్(ఐ.ఎఎస్) అధికారి అంచెలంచెలుగా ఎదిగిన తీరది. వారు ఏం పట్టుకుంటే అది బంగారం అయింది. తొలుత ఓ అధికారిగా, ఆ తర్వాత కంపెనీ అధిపతిగా వ్యవహరించిన అశ్వినీ వైష్ణవ్… ప్రధాని నరేంద్ర మోడీ చూపు పడడంతో ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన ఓ కంపెనీలో కేవలం లక్ష రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయల ఆదాయం పొందారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ నేపథ్యంలో అశ్వినీ వైష్ణవ్ ప్రస్థానంపై ‘న్యూస్లాండ్రీ’ పోర్టల్ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం…
వాజ్పేయి ప్రయివేటు కార్యదర్శిగా
2004లో ప్రధాని పదవికి అటల్ బీహారీ వాజ్పేయి రాజీనామా చేశారు. దానికి ముందు పీఎంఓలో పనిచేస్తున్న డిప్యూటీ సెక్రెటరీ వాజ్పేయి వద్దకు వచ్చారు. తాను కాంగ్రెస్ ప్రధాని వద్ద పనిచేయలేనంటూ మొర పెట్టుకున్నారు. ఆ అధికారి 2006 వరకూ వాజ్పేయి ప్రయివేటు కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఎవరో మీకు అర్థమైంది కదూ…ఆయనే అశ్వినీ వైష్ణవ్. ఒడిశా కేడర్కు చెందిన ఈయన 1994లో ఐఏఎస్ అధికారి అయ్యారు. 2021లో…అంటే ఏడు సంవత్సరాల వ్యవధిలోనే కేంద్ర మంత్రి అయ్యారు.
2019లో రాజకీయ అరంగేట్రం
వ్యాపారస్తులు రాజకీయాల్లో దిగితే ఒకలా, రాజకీయ నేతలే వ్యాపారాలు నిర్వహిస్తూ, ఇటు అధికారి పాత్రలో త్రిబుల్ యాక్షన్ చేశాడు ఈ ప్రబుద్ధుడు. వైష్ణవ్ రాజకీయ జీవితం 2019లో ప్రారంభమైంది. అది కూడా ఆశ్చర్యకరంగానే మొదలైంది. ఒడిశాలో అధికార బీజేడీ, ప్రతిపక్ష బీజేపీ…ఈ రెండు పార్టీలూ కలిసి ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేశాయి. వైష్ణవ్ను తొలుత బీజేడీ తన అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే కొంత ‘అయోమయం’ నెలకొన్నదని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. ‘ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా నాతో మాట్లాడారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ప్రయివేటు కార్యదర్శిగా వైష్ణవ్ పనిచేసినందున ఆయనకు తాము మద్దతు ఇస్తామని చెప్పారు’ అని అన్నారు. ఏమైతేనేం…వైష్ణవ్ నామినేషన్ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య స్వల్పకాలిక మైత్రికి కారణమైంది.
ఇనుప ఖనిజం పరిశ్రమలో అడుగు
వైష్ణవ్ 2003లో స్వరాష్ట్రమైన ఒడిశాను వదిలి వెళ్లారు. వాజ్పేయితోనూ, కొన్ని ఇతర అధికారిక పనుల మీద పనిచేసిన తర్వాత కొంత విరామం ఇచ్చి 2008 నుంచి 2010 వరకూ అమెరికాలోని వార్టన్ స్కూలులో ఎంబీఏ చదివారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని, కార్పొరేట్ సంస్థల కోసం పనిచేశారు. 2015లో తిరిగి ఒడిషా చేరుకున్నారు. ఆ ఏడాదే అడ్లర్ ఇండిస్టియల్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట పరిశ్రమను స్థాపించి ఇనుప ఖనిజపు ఇండిస్టీలో అడుగు పెట్టారు. ప్రారంభంలో అడ్లర్కు కేవలం ఒకే ఒక క్లయింట్ ఉండేవాడు. అతనే బి. ప్రభాకరన్. త్రివేణి ఎర్త్మూవర్స్ అనే కంపెనీకి అధిపతి. ఒడిశాలోని బార్బిల్ పట్టణ పరిసర ప్రాంతంలో ఇనుము, మాంగనీస్ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. వాటిపై ప్రభాకరన్ నియంత్రణ అధికంగా ఉండేది. 2004-2015 మధ్యకాలంలో త్రివేణి ఎర్త్మూవర్స్ అతి పెద్ద కాంట్రాక్టింగ్ కంపెనీగా ఎదిగింది.
రాష్ట్రంలో గనులు లీజుకు తీసుకున్న వారి తరఫున తవ్వకాలు జరపడం దాని పని. అయితే ప్రభాకరన్ చట్టవిరుద్ధంగా అక్రమ మైనింగ్ జరిపారని 2014లో ఎంబీ షా కమిషన్ తేల్చింది. ప్రభాకరన్ కేవలం మైనింగ్ కాంట్రాక్టర్ మాత్రమే కాదని, బినామీ పేర్లతో ఆయన కంపెనీ అనేక గనుల్ని తవ్విందని, చట్టబద్ధంగా తవ్వకాలు జరపడంతో పాటు చట్టవిరుద్ధంగానూ మైనింగ్ కార్యకలాపాలు చేపట్టి భారీగా ఆదాయం ఆర్జించిందని షా కమిషన్ తన నివేదికలో పలుమార్లు ప్రస్తావించింది.
అక్రమ మైనింగ్కు చేయూత
వైష్ణవ్తో ఉన్న సంబంధాల కారణంగానే ప్రభాకరన్ రాజకీయ లబ్ది పొందారని చెబుతూంటారు. ఎన్నికల బాండ్ల రూపంలో త్రివేణి, దాని అనుబంధ సంస్థలు రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు అందించాయి. తదనంతర కాలంలో త్రివేణి ఎర్త్మూవర్స్తో వైష్ణవ్ సంబంధాలు మరింత బలపడ్డాయి. వైష్ణవ్ అడ్లర్ భాగస్వామ్యంతో త్రివేణి పెల్లెట్స్ ప్రయివేట్ లిమిటెడ్ (టీపీపీఎల్) అనే కొత్త కంపెనీ ఆవిర్భవించింది. వైష్ణవ్ కంపెనీ దీనికి రూ.111.50 కోట్ల ఆర్థిక సాయాన్ని సైతం అందించింది. ఈ రుణ సాయం కారణంగా అదే కంపెనీ నుంచి ఇనుపు ఖనిజపు గుళికలు కొనుగోలు చేసి ఆ తర్వాతి సంవత్సరాలలో గణనీయంగా లాభాలు ఆర్జించింది.
కొత్త కంపెనీ ఏర్పడిన 2015-16లో అందులో వైష్ణవ్ సంస్థ పెట్టిన ప్రారంభ పెట్టుబడి కేవలం లక్ష రూపాయలు మాత్రమే. ఆ కొద్దిపాటి పెట్టుబడికే అడ్లర్కు రూ.45 లక్షల ఆదాయం లభించింది. అది ఆ తర్వాత ఇబ్బడిముబ్బడిగా పెరగడం మొదలైంది. 2016-17లో రూ.3.79 కోట్లు, 2017-18లో రూ.4.51 కోట్ల ఆదాయం పొందింది. 2019 వరకూ అడ్లర్ కంపెనీకి అయిన ఖర్చు కేవలం దాని డైరెక్టర్లు వైష్ణవ్, ఆయన భార్య సునీతకు చెల్లించిన రెమ్యునరేషన్ మాత్రమే. వీరిద్దరూ కంపెనీ డైరెక్టర్లుగా గణనీయంగా జీతాలు తీసుకునే వారు. ఉదాహరణకు 2016-17లో కంపెనీకి వచ్చిన రూ.3.79 కోట్ల ఆదాయంలో జీతాలకే రూ.2.46 కోట్లు చెల్లించారు. ఇందులో వైష్ణవ్కు రూ.2.26 కోట్లు, సునీతకు రూ.18 లక్షలు ఇచ్చారు. మొత్తానికి లక్ష రూపాయల పెట్టుబడి కొన్ని సంవత్సరాలకు రూ.113 కోట్ల పుస్తక విలువ కలిగిన వాటాలను సంపాదించి పెట్టింది. ఆ కంపెనీ ఆదాయం ఆరు సంవత్సరాలకే రూ.45 లక్షల నుంచి రూ.323 కోట్లకు పెరిగింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.