స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కల్కి 2లో నటించడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే దీపికాకు ఎదురైన విషయం తెలిసిందే.
ఇప్పుడు సడెన్‌గా కల్కి సీక్వెల్‌లో ఆమె భాగం కావడం లేదని నిర్మాణ సంస్థ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.
కల్కి సీక్వెల్‌లో దీపికా పదుకొణె నటించడం లేదంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఇలా చెప్పుకొచ్చింది. ‘కల్కి 2898AD సినిమాకు రాబోయే సీక్వెల్‌లో దీపికా పదుకొణె నటించడం లేదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. చాలా విషయాల్లో పరిశీలించిన తర్వాత తమ భాగస్వామ్యం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పార్ట్1 సినిమా చేయడానికి చాలా దూరం ప్రయాణించినప్పటికీ, మా మధ్య భాగస్వామ్యం కుదరలేదు. కల్కి వంటి చిత్రానికి నిబద్ధత చాలా అవసరం. ఆమె భవిష్యత్‌లో మరెన్నో సినిమాలు చేయాలని మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము’ అని సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది.
దీపిక డిమాండ్లు
ప్రభాస్- సందీప్‌రెడ్డి సినిమా స్పిరిట్ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె అనుకున్నారు. అయితే, సడెన్‌గా ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని తీసుకున్నారు. ఆ సమయంలో దీపిక కథ లీక్ చేసిందంటూనే పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు వంగా. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో కూడా పని గంటల గురించి, పారితోషికం గురించి ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వైజయంతీ మూవీస్ వారు అందుకు నో చెప్పినట్లు సమాచారం. వారి మధ్య ఢీల్ సెట్ కాకపోవడంతో దీపికా పదుకొణెను తప్పించారని తెలుస్తోంది.






























