సాధారణంగా పుణ్యక్షేత్రాలలో వెలసిన దేవుడికైనా.. సాధారణంగా దేవాలయంలోని దేవుడికి అయినా పుజాదికార్యక్రమాలు ఏడాది పొడవునా జరుపుతారు. గ్రహణ సమయాల్లో తప్ప దాదాపు ఏడాది పొడవునా ఆలయ తలుపులు తెరచుకుని ఉంటాయి. భక్తులకు దర్శనం ఇస్తారు. అయితే మన దేశంలో కొన్ని ఆలయాలు వెరీ వెరీ స్పెషల్.. ఇక్కడ మాత్రం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఆలయాలను తెరుస్తారు. మీరు చదివింది నిజమే.. ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. అటువంటి ఆలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
భారతదేశం దాని సంస్కృతి , ఆహారంతో పాటు, దాని మతపరమైన ఆచారాలకు కూడా చాలా ప్రసిద్ధి. దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఏడాది పొడవునా దేవతా మూర్తులకు పూజలు జరుగుతాయి. నిత్య కైంకర్యాలను నిర్వహిస్తారు. భక్తులు దేవుళ్ళను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే కొన్ని ఆలయాలు కొన్ని నెలల పాటు తెరచి ఉంటాయి. కానీ కొన్ని ఆలయాలు ఏడాదిలో ఒక రోజు మాత్రమే తెరచి ఉంటాయి. అప్పుడే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఏడాదిలో ఒకరోజు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నాగచంద్రేశ్వర ఆలయం, ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలోని రెండో అంతస్తులో ఉన్న శ్రీ నాగచంద్రేశ్వర ఆలయం సర్ప రాజుకి అంకితం చేయబడింది. ఈ ఆలయ తలుపులు సంవత్సరానికి ఒకసారి అంటే నాగ పంచమి రోజున మాత్రమే తెరుచుకుంటాయి. ఈ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. భక్తులు దర్శనం చేసుకున్న అనంతరం మళ్లీ ఆలయ తలుపులు మూసేస్తారు
రాణి పోఖారి ఆలయం: రాణి పోఖారి అంటే రాణి చెరువు. ఈ ఆలయ తలుపులు ప్రతి సంవత్సరం దీపావళి ఐదవ రోజున మాత్రమే తెరుచుకుంటాయని చెబుతారు. ఈ ఆలయం చెరువు మధ్యలో ఉంది. భక్తులు భారే సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు.
మంగళ దేవి ఆలయం, కర్ణాటక: కర్ణాటకలోని మంగళూరు నగరంలో ఉన్న ఈ ఆలయం తలుపులు కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుచుకుంటాయి. ఈ ఆలయం మంగళూరులోని బోలారా అనే ప్రదేశంలో ఉంది. నవరాత్రి సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు
హాసనాంబ ఆలయం: కర్ణాటకలో ఉన్న ఈ ఆలయం అంబా దేవికి అంకితం చేయబడింది. దీపావళి సమయంలో కూడా ఈ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడిందని చెబుతారు.
ఏకలింగేశ్వర మహాదేవ ఆలయం: ఈ ఆధ్యాత్మిక ప్రదేశం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంది. ఈ ఆలయ తలుపులు సంవత్సరానికి ఒకసారి శివరాత్రి రోజున మాత్రమే తెరుచుకుంటాయి. ఈ ఆలయం తలుపులు తెరచుకునేందుకు ఏడాది పొడవునా భక్తులు వేచి ఉంటారు. ఈ రోజున ఇక్కడ దర్శనం కోసం చాలా పొడవైన క్యూ ఉంటుంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లోని బిక్కవోలు సమీప గ్రామంలోని నలుదిక్కుల నాలుగు శివాలయాలను తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించారు. వాటిలో ఒకటైన ఒకటైన ఆలయం కేదారేశ్వరాలయం. అప్పట్లో జరిగిన యుద్ధాలలో ఈ ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూత పడింది. శివలింగం ధ్వంసం కావడం అరిష్టంగా భావించి, ఆలయాన్ని మూసివేశారు. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒక రోజు మహా శివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు. శివరాత్రి పర్వదినాన భక్తులకు స్వామి వారి దర్శనం ఇస్తారు.
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురంలో ఎత్తైన గుట్టమీద శ్రీ రామలింగేశ్వర స్వామి వెలిసినట్టు స్థల పురాణం చెబుతోంది. ఆ గుట్టను రామస్వామి గుట్టగా స్థానికులు పిలుస్తారు. స్వయంభుగా వెలిసిన ఈ ఆలయం ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తెరుస్తారు. ప్రతి ఏటా కార్తిక పౌర్ణమి రోజున ఈ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఒక్కరోజు జాతర నిర్వహిస్తారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.