ఈగలు తోలుకుంటున్న షోరూంలు: ఆ కార్లను ఒక్కరు కూడా కొనలేదా?

భారత మార్కెట్లో కియా మోటార్స్ కంపెనీకి చెందిన సోనెట్, సెల్టోస్ వంటి కాంపాక్ట్, మిడ్ సైజ్ కార్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న విషయం తెలిసిందే.


అయితే ఆ కంపెనీ ఇటీవల విడుదల చేసిన లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. షోరూంలలో ఒక్క కస్టమర్ కూడా వాటిని కొనడానికి ఆసక్తి చూపడం లేదని తాజా విక్రయాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కియా మోటార్స్ విడుదల చేసిన అక్టోబర్ నెల సేల్స్ బ్రేకప్ నివేదికలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ నివేదిక ప్రకారం.. కియా అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ మోడల్ EV6ను అక్టోబర్ నెలలో ఒక్క కస్టమర్ కూడా కొనుగోలు చేయలేదు. మరో సరికొత్త లగ్జరీ ఎస్‌యూవీ మోడల్ కియా EV9ను కేవలం ఒక్కరు మాత్రమే కొనుగోలు చేశారు.

ఈ రెండు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు కలిపి అక్టోబర్ నెలలో కేవలం ఒక యూనిట్ మాత్రమే అమ్ముడైంది. అత్యంత అడ్వాన్సుడ్ ఫీచర్లు, భారీ రేంజ్‌తో వచ్చిన ఈ ఖరీదైన కార్లు ఎందుకు అమ్ముడవ్వలేదు? వాటి ప్రత్యేకతలతో పాటు.. ఆ కార్ల తక్కువ అమ్మకాలకు సంబంధించి కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కియా EV6

కియా మొత్తం అమ్మకాల్లో ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల వాటా చాలా తక్కువగా ఉంది. అక్టోబర్‌లో EV6 సున్నా అమ్మకాలు నమోదు చేసింది. ఇందులో 84kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 663 కి.మీ వరకు ప్రయాణించే రేంజ్‌ను ఇస్తుంది. ఈ కారు 325 PS శక్తిని, 605 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది చాలా శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. కియా ఇటీవల కొత్త EV6 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సింగిల్ వేరియంట్‌లో (GT-Line AWD) విడుదల చేసింది. ఇందులో కొత్త స్టైలింగ్, స్లీక్ హెడ్‌ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఈ కారులో కొత్త స్టీరింగ్ వీల్, ట్విన్-స్క్రీన్ పనోరమిక్ సెటప్ (రెండు స్క్రీన్‌లు కలిపి), ఫింగర్ ప్రింట్ స్టార్టర్, లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 14 స్పీకర్ల మెరిడియన్ సౌండ్ సిస్టమ్ వంటి అద్భుతమైన లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

కియా EV9

EV9 కారు కేవలం ఒక్క యూనిట్ మాత్రమే అమ్ముడైంది. ఇది కియా అత్యంత విలాసవంతమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇందులో భారీగా 99.8kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 561 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఈ లగ్జరీ ఎస్‌యూవీ 384 hp పవర్, 700 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.3 సెకన్లలో 0-100 kph వేగాన్ని అందుకుంటుంది. ఫాస్ట్ ఛార్జర్ (350 kW DC)తో కేవలం 24 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారులో

6-సీట్ లేఅవుట్ (రెండో వరుసలో కెప్టెన్ సీట్లు), కెప్టెన్ సీట్లకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, మసాజ్ ఫంక్షన్ వంటి లగ్జరీ ఫీచర్లు, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌లు వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో 10 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, 360-డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS ఫీచర్లు (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్) వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

అమ్మకాలు తగ్గడానికి గల ప్రధాన కారణాలు

ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్లు తక్కువ సంఖ్యలో అమ్ముడవడానికి ప్రధానంగా ఒక్కటే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు కార్లు కూడా భారతదేశంలో అసెంబుల్ చేయబడవు. ఇవి పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి అవుతాయి. దీని కారణంగా వీటిపై భారీగా దిగుమతి సుంకాలు పడతాయి. దిగుమతి సుంకాల కారణంగా ఈ లగ్జరీ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో రూ.70 లక్షల నుంచి రూ.1కోటి మధ్య ధర ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కొనుగోలు చేయగలిగే అత్యంత సంపన్న కస్టమర్ల సంఖ్య చాలా తక్కువ.

ఈ అధిక-ధరల సెగ్మెంట్‌లో కొనుగోలు చేసే కస్టమర్లు సాధారణంగా లగ్జరీ బ్రాండ్‌లైన మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ కార్లు కియా కంటే కూడా అధిక బ్రాండ్ విలువను కలిగి ఉంటాయి. కియా కంపెనీ ఈ తక్కువ అమ్మకాలపై పెద్దగా ఆందోళన చెందడం లేదని భావిస్తున్నారు. ఎందుకంటే CBU మార్గంలో అధిక ధరల కారణంగా అమ్మకాలు తక్కువగా ఉంటాయని కంపెనీ ముందుగానే అంచనా వేసి ఉండవచ్చు. ఈ కార్లను భారత్‌లో విక్రయించడం కేవలం బ్రాండ్ సాంకేతిక సామర్థ్యాన్ని, లగ్జరీ స్థాయిని చాటిచెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.