పొలాల గట్ల వెంట.. వ్యవసాయ బావుల వద్ద సేదతీరే ట్రాక్టర్లే వాళ్ల టార్గెట్. గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసి.. రాత్రికి రాత్రే రాష్ట్రం దాటించేస్తారు.
ఆపై సెకండ్ హ్యాండ్ కింద ఆన్‌లైన్‌లోనే దర్జాగా వాటిని అమ్మేస్తారు. అయితే దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే కదా. హైదరాబాద్ శివారుల్లో చోటు చేసుకున్న సరికొత్త చోరీల కేసుల్ని పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు.
ట్రాక్టర్ ట్రాలీలను చోరీ చేస్తున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. వ్యవసాయ కూలీలుగా పని చేసే సంపంగి మహేష్.. ఉర్సు వెంకన్నలు ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు దిగారు. రాత్రుల్లో బావుల వద్ద ఉంచిన ట్రాక్టర్ ట్రాలీలను ఎత్తుకెళ్లి.. రాత్రికి రాత్రే రాష్ట్రం దాటించేవారు. ఆ తర్వాత వాటిని నేరుగా అమ్మితే దొరికిపోతామని ఓఎల్‌ఎక్స్ తరహా ఆన్‌లైన్ సైట్లలో అమ్మకానికి ఉంచారు. అలా అమ్మేయగా వచ్చిన డబ్బుతో విలాసాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో..
మాడ్గుల్ మండలం(రంగారెడ్డి జిల్లా) పరిధిలో డిసెంబర్ 31న ట్రాక్టర్ దొంగతనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేయగా దొంగలు దొరికిపోయారు. వాళ్ల దగ్గరి నుంచి సుమారు 20 లక్షలు విలువ చేసే 13 ట్రాక్టర్ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ లో 10 దొంగతనాలు.. నల్గొండలో ఒకటి.. నాగర్ కర్నూల్లో ఒక కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు.