ఒక్కసారిగా సోషల్ మీడియా చూసి “చలాన్లపై భారీ డిస్కౌంట్ వచ్చిందట… 100% రాయితీ కూడా ఇస్తారట!” అని నమ్మతే పప్పులో కాలేసినట్లే.
ట్రాఫిక్ చలాన్లపై భారీ తగ్గింపుల పేరుతో తిరుగుతున్న ఈ ప్రచారం మొత్తం ఫేక్ అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు ఇది మంచి అవకాశం అనుకుంటున్న వాహనదారులు అసత్య సమాచారానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు.
ఇటీవలి రోజుల్లో ఇంటర్నెట్‌లో డిసెంబర్ 13న చలాన్లపై పూర్తి రాయితీలు ఇస్తున్నారంటూ వేగంగా ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా స్పష్టతనిచ్చారు. ఆ తేదీన ఎలాంటి లోక్ అదాలత్ నిర్వహించడంలేదని, చలాన్లపై రాయితీలకు సంబంధించిన ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ ఇప్పటివరకు జారీ కాలేదని తెలిపారు. ప్రజలు ఇలాంటి తప్పుడు పోస్టులను నమ్మకుండా, మరెవరికి పంపకుండా జాగ్రత్తపడాలని సూచించారు.
ఇక తరచూ చలాన్లపై డిస్కౌంట్లు ప్రకటించడం సరికాదని, అలాంటి రాయితీలు వాహనదారుల్లో భయం తగ్గించి నిబంధనల ఉల్లంఘనలు పెరిగే అవకాశముందని హైకోర్టు ఇప్పటికే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీ లేదు. పెండింగ్ చలాన్ల గురించి నమ్మకమైన, అధికారిక సమాచారం కోసం మాత్రమే పోలీసుల వెబ్‌సైట్‌లు, యాప్‌లను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.



































