ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్లు.. హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించిన తర్వాత, వాటిపై ప్రభుత్వం తరచుగా రాయితీలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. వాహనాల రకాన్ని బట్టి 75 నుంచి 25 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తుంటారు.


పేరుకుపోయిన పెండింగ్ చలాన్ల బకాయిలను రికవరీ చేసుకునేందుకు ప్రభుత్వం అప్పుడప్పుడు డిస్కాంట్లు ఇస్తుంటుంది. ఇలా డిస్కౌంట్లు ప్రకటించడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రాయితీలు ఇవ్వడం వలన చట్టపరమైన పరిణామాల పట్ల ప్రజల్లో ఉన్న భయం, గౌరవం బలహీనపడతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా.. రాయితీలు ట్రాఫిక్‌ క్రమశిక్షణారాహిత్యాన్ని మరింత పెంచుతాయని, ప్రజలు నిబంధనలను ఉల్లంఘించినా ఏదో ఒక దశలో రాయితీ లభిస్తుందనే భావన పెరిగే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.

జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టిన ఈ కేసులో.. ఈ-చలానా వ్యవస్థలో అత్యవసరంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ట్రాఫిక్‌ ఉల్లంఘన జరిగినప్పుడు అది ఏ చట్టంలోని ఏ సెక్షన్‌ కింద ఉల్లంఘనగా పరిగణించబడిందనే వివరాలను చలానా జారీ సమయంలో స్పష్టంగా పొందుపరచగలిగే వ్యవస్థను అభివృద్ధి చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలు, వ్యవస్థ అభివృద్ధి ఏ దశలో ఉందో సమగ్ర నివేదికను డిసెంబర్ 9వ తేదీలోగా సమర్పించాలని హైకోర్టు హోంశాఖను ఆదేశించింది. ఈ సాంకేతిక మెరుగుదల కేంద్ర మోటారు వాహన నిబంధన 167 ప్రకారం తప్పనిసరి అని న్యాయమూర్తి గుర్తు చేశారు.

హైదరాబాద్‌ తార్నాకకు చెందిన వి.రాఘవేంద్రాచారి అనే వ్యక్తి బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌ చేసినందుకు విధించిన రూ.1200 జరిమానాను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 1988 మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 128 రెడ్‌విత్‌ 177 ప్రకారం ట్రిపుల్‌ రైడింగ్‌కు కేవలం రూ.100 నుంచి రూ.300 మాత్రమే జరిమానా విధించాల్సి ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2019లో కేంద్రం చేసిన చట్ట సవరణలను తెలంగాణ ప్రభుత్వం ఇంకా అమలులోకి తీసుకురాకపోవడంతో పాత నిబంధనల ప్రకారమే చలానాలు విధించాలని వాదించారు. అంతేకాక, చట్టంలోని ఏ నిబంధన కింద ఉల్లంఘన జరిగింది అనే వివరణ చలానాలో లేకపోవడం కూడా చట్ట విరుద్ధమని తెలిపారు.

అందుకు ప్రతిస్పందనగా.. హోంశాఖ తరఫు న్యాయవాది మహేశ్‌ రాజె ప్రస్తుత చలానా వ్యవస్థలో చట్ట నిబంధనలతో సహా పూర్తి వివరాలు పొందుపరచడానికి సాంకేతికంగా వీలుకావడం లేదని కోర్టుకు వివరించారు. అయినప్పటికీ, అధికారులు నిబంధనలతో చలానా జారీ చేసే విధంగా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సెక్షన్‌ 184 కింద జరిమానా రూ.1000 ఉన్నప్పుడు, పిటిషనర్‌కు రూ.1200 ఎలా విధించారనే అంశంపై కూడా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, తదుపరి విచారణను వాయిదా వేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.