దీపావళి సీజన్ రానే వచ్చింది. ఇప్పటికే దీపావళి సందడి షురువైంది. ఇక దీపావళి పండగ అనగానే టక్కున గుర్తొచ్చేది ఫైర్ క్రాకర్స్. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా టపాసులు పేల్చుతుంటారు. టపాసుల మోతలతో వీదులన్నీ దద్దరిల్లిపోతుంటాయి. ఎక్కడ చూసినా టపాసులు కాల్చుతూ సందడి చేస్తుంటారు. అయితే ఈ టపాసుల వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఫైర్ క్రాకర్స్ నుంచి వచ్చే పొగ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. వినికిడి లోపాలు తలెత్తుతుంటాయి. టపాసులు చేతిలో పేలడం వల్ల గాయాలపాలవుతుంటారు. టపాసులు పేలి కళ్లు పోయే ప్రమాదం ఉంటుంది. కాళ్లు, చేతులు ఇలా ఒంటి నిండా గాయాలు అవుతుంటాయి.
టపాసులు పేల్చి ప్రమాదానికి గురైన వారితో ఆసుపత్రులు కిక్కిరిసిపోతుంటాయి. బాధితులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. దీపావళి ఫెస్టివల్ ను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నది. భారతదేశంలో ఫేన్ పే సంస్థ సరికొత్త బీమా పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకమే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీ. దీని ద్వారా దీపావళి సమయంలో టపాసుల ద్వారా గాయాలపాలైతే ఈ పాలసీ తీసుకున్న కస్టమర్లకు బీమా సౌకర్యం కల్పిస్తారు. కేవలం రూ. 9 చెల్లిస్తే రూ.25,000 వరకు కవరేజీని అందించనున్నట్లు ఫోన్ పే స్పష్టం చేసింది.
దీనికి సంబంధించి ఫోన్ పే అక్టోబర్ 14న కీలక ప్రకటన చేసింది. ఇకపై తన ప్లాట్‌ఫాంలో టాపాసుల సంబంధిత ప్రమాదాల నుంచి సమగ్ర రక్షణ కోసం బీమా పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి 10 రోజులపాటు ఈ బీమా కవరేజీ లభిస్తుందని ఫోన్ పే వెల్లడించింది. ఫోన్ పే యూజర్ తో పాటు భార్యాపిల్లలు సహా నలుగురు వ్యక్తుల వరకు సమగ్ర కవరేజీ తీసుకోవచ్చని తెలిపింది. అక్టోబర్ 25 తర్వాత కొనుగోలు చేసిన వారికి ఆ రోజు నుంచే కవరేజీ ప్రారంభం అవుతుంది. దీపావళిని దృష్టిలో పెట్టుకుని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి దీన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
ఫోన్‌పే యాప్‌లో నిమిషంలోపు దీనిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ చెప్పింది. టపాసులు కాల్చి గాయాలపాలైన వారిని ఈ పాలసీ ఆర్థికంగా రక్షిస్తుంది. ఈ పాలసీని కొనుగోలు చేసేందుకు ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి అందులో బీమా విభాగానికి వెళ్లి, హోమ్‌పేజీ నుంచి ఫైర్‌క్రాకర్ బీమాను ఎంచుకోవాలి. ఆ తర్వాత అవసరమైన వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు ‘ప్రొసీడ్ టు పేమెంట్’ ఆప్షన్ క్లిక్ చేసి పాలసీని కొనుగోలు చేయవచ్చు.