జనవరి 15 నుంచి ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు కొత్త నిబంధనలు రివార్డ్ పాయింట్లు, కార్డు బెనిఫిట్స్, రోజువారీ ఖర్చులపై భారీ మార్పులుయాడ్-ఆన్ కార్డులపై కొత్త రుసుములు
- ఏయే క్రెడిట్ కార్డులపై ఎంత ఛార్జీలు ఉండొచ్చంటే?
ICICI Credit Card New Rules : ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ అలర్ట్.. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతుంటే ఇది మీకోసమే. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు తమ క్రెడిట్ కార్డ్ రూల్స్ సవరించి కొత్త నిబంధనలను తీసుకొస్తోంది.
జనవరి 15, 2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్ ప్రకారం.. రివార్డ్ పాయింట్లు, కార్డు బెనిఫిట్స్, రోజువారీ ఖర్చులు, విదేశీ కరెన్సీ పేమెంట్లు, ఎంటర్ టైన్మెంట్ ఆఫర్లు రివార్డ్‌లతో పాటు కొన్ని పేమెంట్లపై రుసుముల్లో భారీగా మార్పులు రానున్నాయి. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ :
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ఐసీఐసీఐ ఎమరాల్డ్ మెటల్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రిటైల్ ఖర్చులపై ప్రతి రూ. 200కి 6 రివార్డ్ పాయింట్లను పొందుతారు. కానీ, ఈ రివార్డ్ పాయింట్లు ఇకపై ప్రభుత్వ సేవలు, ఫ్యూయిల్, ప్రాపర్టీ మేనేజ్మెంట్, అద్దె, టాక్స్ పేమెంట్, థర్డ్ పార్టీ వాలెట్ల వంటి ఖర్చులపై అందుబాటులో ఉండవు.
బుక్‌మైషోలో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ :
బుక్‌మైషోలో (BookMyShow) ఆఫర్‌కు అర్హత పొందాలంటే ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్ ప్రకారం.. గత త్రైమాసికంలో కనీసం రూ.25వేలు ఖర్చు చేయాలి. ఎంపిక చేసిన కార్డులపై ప్రతి త్రైమాసికంలో ఈ నిబంధన చెక్ చేస్తుంది బ్యాంకు.
యాడ్-ఆన్ కార్డులపై కొత్త రుసుములివే :
ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్ మెటల్ క్రెడిట్ కార్డ్, కొత్త యాడ్-ఆన్ కార్డులకు ఇప్పుడు రూ. 3,500 వన్-టైమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ జనవరి 15 నుంచి అమల్లోకి వస్తాయి. విదేశీ కరెన్సీ లావాదేవీలకు సంబంధించిన ఫీజులను కూడా బ్యాంక్ సవరించింది. ఈ ఫీజు మార్పులు ఈ కింది విధంగా ఉన్నాయి.
- టైమ్స్ బ్లాక్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ : 1.49 శాతం
- ఐసీఐసీఐ ఎమరాల్డ్ మెటల్, ఎమరాల్డ్, ఎమరాల్డ్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ : 2 శాతం
- మేక్మైట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్ ట్రావెల్ కార్డ్ : 0.99 శాతం
- అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ : 1.99 శాతం
- మేక్మైట్రిప్ సిగ్నేచర్ ప్లాటినం వంటి అన్ని ఇతర క్రెడిట్ కార్డులపై 3.50 శాతం
Dream11, Rummy Culture, Junglee Games, MPL వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేసే పేమెంట్లపై ఇప్పుడు 2 శాతం రుసుము చెల్లించాలి. ఇంకా, క్రెడిట్ కార్డ్ యూజర్లు Amazon Pay, Paytm , MobiKwik, Freecharge, OlaMoney వంటి వాలెట్లలో రూ.5వేలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే 1 శాతం రుసుము చెల్లించాలి.
ఇంకా, క్రెడిట్ కార్డ్ బిల్లులను బ్రాంచ్‌లో క్యాష్ రూపంలో చెల్లిస్తే ఇప్పుడు ప్రతి లావాదేవీకి రూ.100కు బదులుగా రూ. 150 చెల్లించాలి.


































