Do you have Rs.500 notes with a star symbol?.. But you must know this!

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఫేక్ న్యూస్ బెడద ఎక్కువై పోయింది. వాస్తవాలకు విరుద్ధంగా జరుగుతున్న ఎన్నో ప్రచారాలు జనాలను అయోమయానికి గురిచేస్తున్నాయి.
ఇటీవల ఇలాంటిదే ఒక ప్రచారం జరిగింది. అదేంటంటే నక్షత్రం (*) గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవని దేశంలోని పలు చోట్ల జోరుగా ప్రచారం జరిగింది. ఈ మేరకు వాట్సప్ సహా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ వార్త తెగ చక్కర్లు కొట్టింది. ఇంకేముందీ చాలా మంది బ్యాంకులకు వెళ్లి మరీ ఈ నోట్లు తిరిగిచ్చేస్తున్నారని ప్రచారం చేశారు. ఈ ప్రచారమంతా నిజమేనేమో అని నమ్మేట్టుగా ఎక్స్ వేదికగా కూడా విస్తృత ప్రచారం జరిగింది. ‘ స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు మార్కెట్‌లో చెలామణి అవుతున్నాయి. ఇలాంటి నోటు ఒకటి నా దగ్గరకు కూడా వచ్చింది. అది నకిలీ నోటు. ఈ రోజు నా స్నేహితుడు వద్దకు ఓ కస్టమర్ నుంచి ఇలాంటివి 2-3 నోట్లు వచ్చాయి. శ్రద్ధగా పరిశీలించి వాటిని వెనక్కి తిరిగిచ్చేశాడు” అని పేర్కొన్నాడు.
అయితే ఈ ప్రచారమంతా నకిలీదేనని తేలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం నక్షత్రం (*) గుర్తు ఉన్న నోటుని ఒక నోటు స్థానంలో మరో దాన్ని ముద్రించారని లేదా పున:ముద్రించారని అర్థంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ పీఐబీ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 2016 నుంచి స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు చెలామణిలో ఉన్నాయని తెలిపింది. 2016 నాటి ఆర్‌బీఐ సర్క్యూలర్‌ను కూడా జోడించింది. ట్వీట్ ద్వారా ఈ క్లారిటీ ఇచ్చింది. దీంతో స్టార్ గుర్తు ఉన్న నోట్లు నిజమైనవేనని నిర్ధారణ అయ్యింది.