శరీరంలోని రెండో గుండె గురించి తెలుసా? దాని ప్రాముఖ్యతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

 గుండె ఆరోగ్యం కాపాడుకోవాలని అందరికీ తెలుసు. అయితే మీకు తెలుసా? మన శరీరంలో మరో అవయవాన్ని రెండో గుండె అని పిలుస్తారని. అంటే మానవ శరీరంలో సెకండ్ హార్ట్ (Second Heart) ఉందా?


లేదు అనే చెప్తారు నిపుణులు. కానీ గుండెలాంటి మరో ముఖ్యమైన అవయవం ఉందని.. దానిని రెండో గుండె అంటారని.. దానిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే అవి కూడా గుండెకు రక్తాన్ని పంప్ చేయడంలో హెల్ప్ చేస్తాయట. అవే దూడ కండరాలు(Calf Muscles). అంటే ఇవి మోకాలికి కింద వెనక భాగంలో పాదాలకు విస్తరించి ఉండే కండరం. దీనిని పిక్క కండరం (గ్యాస్ట్రోక్నిమియస్, సోలియస్) అని కూడా అంటారు.

ప్రతి అడుగు ఛాతీకి రక్తాన్ని పంప్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ నడవండి. రెగ్యులర్​గా స్ట్రెచ్ చేయండి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుందని చెప్తున్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ కుమార్ గార్గ్. దూడకండరాల ఆరోగ్యానికి సంబంధించిన వీడియోను ఇన్​స్టాలో షేర్ చేశారు. రెండో గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

పరిశోధనలు ఏమంటున్నాయంటే..

హృదయనాళ ఆరోగ్యానికి దూడ కండరాల ప్రాముఖ్యత(Calf Muscle Importance)ను తెలిపే పరిశోధనలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే దూడ కండరాల పంప్ (CMP) బలహీనంగా ఉంటే.. ఆరోగ్య కారకాలతో పాటు.. అన్ని కారణాల మరణాలను గణనీయంగా పెంచుతుందని మేయో క్లినిక్ గోండా వాస్కులర్ లేబొరేటరీ నుంచి వచ్చిన పీర్-రివ్యూడ్ స్డడీ తెలిపింది. JAMA సర్జరీలో ప్రచురించిన మరో అధ్యయనంలో వ్యాయామ సమయంలో రక్తప్రసరణకు అవసరమైన శక్తిలో 30శాతం కంటే ఎక్కువ దూడ కండరమే సరఫరా చేస్తుందని తెలిపింది. ఈ రెండూ కూడా దూడ కండరాల ఆరోగ్యాన్ని(Calf Muscles Health) హైలెట్ చేశాయి. అందుకే వాటిని జాగ్రత్తగా ఉంచుకునేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అంటున్నారు. డాక్టర్ ఆశిష్.

వ్యాయామం (Calf Stretching Benefits)

హార్వర్డ్ హెల్త్ ప్రకారం.. దూడ కండర ఆరోగ్యానికి దానిని స్ట్రెచ్ చేయడం అవసరమని చెప్తున్నారు. దీనివల్ల రక్త ప్రవాహం పెరిగి వశ్యతను పెంచుతుందని చెప్తున్నారు. అలాగే డైనమిక్, స్టాటిక్ కదలికలను మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. కాబట్టి నిల్చొన్ని లెగ్ స్వింగ్స్ చేయాలి. అంటే. నిల్చొని.. మీ కాలును ముందుకు, వెనక్కి ఊపాలి. ఇలా ఒక్కో కాలును 10 నుంచి 20 సార్లు చేయాలి. ఇది వార్మ్​ అప్​గా పని చేసి రక్త ప్రసరణ మెరుగవుతుంది. అలాగే గోడ లేదా కూర్చీపై చేతులు ఉంచియయ కాలును వెనక్కి స్ట్రెచ్ చేయాలి. మడమను నేలపై మీకు వీలైనంత స్ట్రెచ్ చేయాలి. ఇలా 60 సెకన్లు చేస్తే మజిల్ రిలాక్స్ అవుతుంది.

చల్లని వాతావరణంలో

చలికాలంలో కండరాలు బిగుసుకుపోతాయి. కాబట్టి ఆ సమయంలో కాళ్లను కచ్చితంగా స్ట్రెచ్ చేయాలని అఁటున్నారు హార్వర్డ్ వైద్య నిపుణులు. కండరాలు వేడెక్కినప్పుడు మెరుగైన రక్తప్రసరణ అందుతుంది. అలాగే చలికాలంలో కండరాలు పట్టేయకుండా, గాయాన్ని తగ్గించి.. సిరల రాబడిని పెంచుతుంది. కాబట్టి పైన చెప్పిన రెండు వ్యాయమాలు చేయాల్సి ఉంటుంది.

మెరుగైన రక్తప్రసరణ (Blood Circulation Exercises)

దూడ కండరాలు సాగతీయడం వల్ల ధమని విస్తరణ పెరిగి రక్త ప్రవాహం మెరుగుపడుతుందని జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అధ్యయనం తెలిపింది. ఇది రక్తపోటునుకూడా తగ్గించగలదని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నివేదించింది.

కాబట్టి గుండె ఆరోగ్యంతో పాటు రెండో గుండె అయిన దూడ కండరాలను కూడా కాపాడుకోవాలి. దీనిలో భాగంగా రోజూ 15 నుంచి 20 నిమిషాలు నడక, స్ట్రెచింగ్ చేస్తే దీర్ఘకాలిక హృదయ ఆరోగ్యం కాపాడుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.