రోజుకు ఎన్ని విటమిన్లు తీసుకోవాలో తెలుసా? WHO మార్గదర్శకాలు ఇవే

రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పిన ఓ మాట మీరు వినే ఉంటారు. వినని వారికోసం.. ‘శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, దీపానికి నూనె కూడా అంతే ముఖ్యం’ అని చెప్పారు.


అంటే ఒక వ్యక్తి సంతోషంగా జీవితాన్ని గడపడానికి ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యంగా లేకపోతే.. వివిధ రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. దానివల్ల జీవితాన్ని ఆనందించలేకపోతారు. కాబట్టి మంచి జీవితాన్ని గడపాలనుకుంటే.. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు తగినంతగా అందుతాయి. ఒక వ్యక్తి రోజుకు ఎన్ని విటమిన్లు తీసుకోవాలో.. ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం? WHO మార్గదర్శకాలు ఏంటో చూసేద్దాం.

రోజులో ఎన్ని విటమిన్లు అవసరం?

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్లు చాలా అవసరం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు హార్మోన్ల సమతుల్యత, కణాల మరమ్మత్తు, శక్తి ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ మనం రోజుకు ఎన్ని విటమిన్లు తీసుకోవాలి? WHO విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. సమతుల్య ఆహారం ద్వారా చాలా వరకు విటమిన్ల అవసరాలు తీర్చుకోవచ్చు. కానీ ఆహారం సరిగ్గా లేకపోతే లేదా ఆరోగ్య పరిస్థితి ప్రత్యేకంగా ఉంటే విటమిన్ల లోపం ఏర్పడవచ్చు. అలాంటి పరిస్థితిలో అవసరానికి అనుగుణంగా సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

ఒక వ్యక్తికి ఒక రోజులో ఎన్ని విటమిన్లు అవసరమనేది అది వ్యక్తి వయస్సుపై ఆధారపడి ఉంటుంది. WHO, ఇతర ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం.. పెద్దలకు ప్రతిరోజూ 10 మైక్రోగ్రాముల విటమిన్ D అవసరం. ఇది ఎముకలు, రోగనిరోధక వ్యవస్థకు అవసరం. తరువాత విటమిన్ A వస్తుంది. మహిళలకు రోజుకు కనీసం 600 మైక్రోగ్రాములు, పురుషులకు 700 మైక్రోగ్రాములు ఉండాలి. ఇది కళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. విటమిన్ E రోజుకు దాదాపు 10 మిల్లీగ్రాములు తీసుకోవాలి. ఇది యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.

విటమిన్ K విషయానికి వస్తే.. మహిళలు రోజుకు 90 మైక్రోగ్రాములు, పురుషులు 120 మైక్రోగ్రాముల వరకు తీసుకోవాలి. విటమిన్ B6 మోతాదు దాదాపు 1.6 నుంచి 1.8 మిల్లీగ్రాములు, విటమిన్ B2 (రైబోఫ్లేవిన్) రోజుకు దాదాపు 1.6 నుంచి 2.0 మిల్లీగ్రాములు తీసుకోవాలి.

దీని కంటే ఎక్కువ విటమిన్లు తీసుకోవచ్చా?

WHO ప్రకారం.. కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E, K వంటివి అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అవి శరీరంలో పేరుకుపోతాయి. అది ఆరోగ్యానికి హానికరం. దీని మోతాదును భర్తీ చేయడానికి ఆకుకూరలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి వ్యాధులు లేకుండా.. విటమిన్ల లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు రాకుండా హెల్తీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.