దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తమ కుటుంబానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా కృష్ణంరాజు, ప్రభాస్ ఆహారపు అలవాట్లు, వారి మధ్య అనుబంధం, కృష్ణంరాజు గొప్ప వ్యక్తిత్వం గురించి ఆమె వివరించారు.
ప్రభాస్ కోసం షూటింగ్‌లకు ప్రత్యేకంగా పెద్ద క్యారియర్‌లలో ఇంటి వంటకాలను పంపేవారమని శ్యామలాదేవి తెలిపారు. కృష్ణంరాజు గారికి, ప్రభాస్ ఇద్దరికీ పులస చేపల పులుసు అంటే అమితమైన ఇష్టమని, ఇది వారికి పూర్వీకుల నుంచి వచ్చిన అలవాటు అని చెప్పారు. పులస దొరికితే వెంటనే ఇంటికి వచ్చేయాల్సిందేనని, ప్రభాస్ డైట్‌లో ఉన్నప్పటికీ పులస పులుసు కోసం చీట్ డే తీసుకునేవారని ఆమె నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. అయితే ప్రభాస్ ఓ సందర్భంలో ఫేవరెట్ డిష్ ఎప్పటికప్పుడు మారిపోతుందని చెప్పారు. బిర్యానీ, రొయ్యల కూర, అలాగే పులావ్, రసం, చేపల పులుసు కలిపి తినే కాంబినేషన్‌ను కృష్ణంరాజు బాగా ఇష్టపడేవారని, అతిథులకు స్వయంగా వడ్డించేవారని శ్యామలాదేవి పేర్కొన్నారు. కృష్ణంరాజు గారు అతిథి మర్యాదలకు ప్రసిద్ధి అని, స్నేహితులు లండన్ నుంచి వచ్చినా వారి ఇష్టాలను అడిగి మరీ వంటలు చేయించి, స్వయంగా వడ్డించేవారని చెప్పారు.
శ్యామలాదేవి తమ వివాహ బంధం గురించి మాట్లాడుతూ, కృష్ణంరాజు తనకు మొదటిసారి కొనిచ్చిన రెండు చీరలను ఇప్పటికీ జాగ్రత్తగా దాచుకున్నానని అన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా కృష్ణంరాజు షాపింగ్ విషయంలో వెనకాడేవారు కాదని, పిల్లలందరికీ డజన్ల కొద్దీ వస్తువులు కొని తెచ్చేవారని, అదే అలవాటు ప్రభాస్‌కు కూడా వచ్చిందని తెలిపారు. ప్రభాస్ విదేశాల నుండి తెచ్చిన రోలెక్స్ వాచీలను కృష్ణంరాజు గారు ఎంతగానో ఆనందించేవారని, కొడుకు ఇచ్చినవని గర్వంగా పెట్టుకునేవారని శ్యామలాదేవి చెప్పారు. ప్రభాస్, కృష్ణంరాజు మధ్య ఉన్న బలమైన బంధం గురించి కూడా ఆమె మాట్లాడారు. ప్రభాస్ పెదనాన్నను చూడటానికి వచ్చే ముందు రెండు గంటల ముందు ఫోన్ చేసి, ఎక్కువసేపు కూర్చుంటానని చెప్పేవారని శ్యామలాదేవి వివరించారు. కృష్ణంరాజు గారి మరణానంతరం కుటుంబం తీవ్ర నిరాశలోకి వెళ్ళినప్పుడు, ప్రభాస్ వారికి ఎంతో అండగా నిలిచారని ఆమె గుర్తు చేసుకున్నారు. “పెదనాన్న ఎక్కడికీ వెళ్ళలేదు, సంపూర్ణమైన జీవితం అనుభవించి మన దగ్గరే ఉన్నారు. మీరు బాధపడితే ఎవ్వరూ మీ దగ్గరకు రారు. మీరు పెదనాన్న ఉన్నట్టుగా అందరికీ కనిపించాలి” అని ప్రభాస్ తనకు ధైర్యం చెప్పాడని శ్యామలాదేవి తెలిపారు. ప్రభాస్ మాటలతోనే తను డిప్రెషన్ నుండి బయటపడి, కృష్ణంరాజు జ్ఞాపకాలను ముందుకు తీసుకువెళ్తూ ప్రజలతో మమేకం అవుతున్నానని ఆమె చెప్పారు. కృష్ణంరాజు గారు సినీ, రాజకీయ జీవితాలను సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకున్నారని, ఇప్పటికీ ఇరు రంగాల ప్రముఖులు తమ కుటుంబానికి ఎంతో గౌరవం ఇస్తున్నారని శ్యామలాదేవి సంతోషం వ్యక్తం చేశారు.
ప్రభాష్ డైలీ ఫుడ్ ఖర్చు ఎంత..?
కనిపించిన మనిషి ఎవరైనా సరే.. వారికి భోజనం పెట్టడం ప్రభాస్ స్టైల్. అలా అని ఒకటి అరా వంటకాలు కాదు.. పేర్లు చెప్పడానికే పావు గంట పట్టేలా ప్రభాస్ వారికి భోజనాలు పంపిస్తాడు. అంతేకాదు.. ప్రభాస్ షూటింగ్ సెట్‌లో ఉన్నా ఒక్కడే తినడు. చుట్టూ ఉన్న 10-20 మందితో కలిసి భోజనం చేస్తాడు. ఇంకొన్నిసార్లు అయితే సెట్‌లో ఉన్నవాళ్లందరికీ కూడా ప్రభాస్ ఇంటి నుంచి భోజనాలు వస్తుంటాయి. ఆయన భోజనం ఎలా పెడతారో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు చెప్పారు.
అందుకే ప్రభాస్ కోసం స్పెషల్ కుకింగ్ టీం ఉందని వినికిడి. వీళ్లు ఓ రోజులో ప్రిపేర్ చేసి ఫుడ్ విలువ దాదాపు రూ.2 లక్షల వరకు ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. ప్రభాస్ మనస్తత్వం మనకు తెలిసిందే. ఇంతకంటే ఖర్చు ఎక్కువ అవ్వొచ్చు కానీ తక్కువ మాత్రం అయ్యే చాన్స్ లేదు. ఎందుకంటే మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు.. వాటితో వివిధ రకాల కాంబినేషన్స్.. రోజుకు అంతమందికి అంటే.. ఆ మాత్రం ఖర్చు ఉంటుందిలే!


































