సెమీకాన్ ఇండియా-2025లో భారత్ (India) సెమీకండక్టర్ చరిత్రలో ఓ మైలురాయిగా ఉండిపోయింది. దీనిలో దేశీయంగా తయారు చేసిన తొలి చిప్ విక్రమ్-3201 (Vikram 32)ను ఆవిష్కరించారు.
సెమీ కండక్టర్లలో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ వేసిన తొలి అడుగుగా నిలిచింది. దీనిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) – ది సెమీ కండక్టర్ లేబొరేటర్ (చండీగఢ్) సంయుక్తంగా రూపొందించాయి.
కఠిన పరిస్థితుల్లో కూడా..
అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడేట్లుగా దీనిని రూపొందించారు. ఇది -55 డిగ్రీల చలి నుంచి +125 డిగ్రీల సెల్సియస్ వేడి వరకు తట్టుకోగలదు. ఈ సెమీ కండక్టర్ మైక్రో ప్రాసెసర్ మనం రోజువారీ వాడుకొనే ల్యాప్‌ట్యాప్, స్మార్ట్‌ఫోన్ వంటి పరికరాల్లో వినియోగించడానికి వీలు లేదు. కేవలం అంతరిక్ష పరిశోధనల కోసమే దీనిని రూపొందించారు. వీటిని రాకెట్స్, ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్ ఏవియానిక్స్‌లో వాడనున్నారు. దీనిని 2009లో వచ్చిన విక్రమ్ 1601 (Vikram1001) చిప్‌నకు అప్‌గ్రేడ్‌గా చూడాల్సి ఉంటుంది.
దీని 32 బిట్ ప్రాసెసర్ ఏమి చేస్తుంది..?
ఈ చిప్‌ను లాంచ్ వెహికల్‌లో నేవిగేషన్, కంట్రోల్, మిషన్ మేనేజ్‌మెంట్, స్ప్లిట్ సెకన్లను గణించడం వంటివి చేస్తుంది. రాకెట్ సరైన మార్గంలో ప్రయాణించడానికి ఇవి చాలా కీలకం. అత్యంత కఠినంగా ఉండే అంతరిక్ష వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని.. దీనిని మిలటరీ గ్రేడ్ ప్రమాణాలతో నిర్మించారు. విక్రమ్-32 సామర్థ్యాన్ని అత్యంత వేడి, చలి, భారీ ప్రకంపనలు, రేడియేషన్‌ల మధ్య పరీక్షించారు. 64 బిట్ చిప్ అత్యధికంగా ఏం చేయగలదో ఇది కూడా అంత సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పటి వరకు 2009లో నిర్మించిన విక్రమ్-16 బిట్ ప్రాసెసర్‌నే లాంచ్ వెహికల్స్‌కు వినియోగించారు.
అంతరిక్షంలో పరీక్షించారా..?
విక్రమ్-32 (Vikram 32) ను అంతరిక్షంలో పరీక్షించారు. దీనిని పీఎస్‌ఎల్‌వీ-సీ60 ప్రాజెక్టులో వాడారు. దానిలోని ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంట్ మాడ్యూల్‌లోని మిషన్ మేనేజ్‌మెంట్ కంప్యూటర్‌లో వినియోగించారు. దానిలో అద్భుతంగా పనిచేయడంతో ఇస్రోలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఈ ఏడాది మార్చి 5వ తేదీన విక్రమ్-32, కల్పన 32 చిప్స్‌ను ఉత్పత్తి చేసి.. ఆ లాట్లను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్‌కు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ అందజేశారు.
ఎందుకు వీటికింత ప్రాధాన్యం..?
అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించే చిప్స్ సాధారణంగా వాణిజ్య స్థాయిలో అందుబాటులో ఉండవు. చాలా కఠిన పరిస్థితులను తట్టుకొనేలా వాటిని రూపొందించాలి. ఇప్పటి వరకు భారత్ (India) ఇటువంటి చిప్స్ కోసం వివిధ దేశాలపై ఆధారపడింది. విక్రమ్-32తో భారత్ స్వయం సమృద్ధి సాధించింది.
ఈ చిప్ కేంద్రంగా.. భారత్ (India) అడా కంపైలర్స్, అసెంబ్లర్స్, లింకర్స్, సిమ్యులేటర్లను అభివృద్ధి చేసుకోవడం విశేషం. దీంతో అంతరిక్ష కార్యక్రమాలకు అవసరమయ్యే పరికరాలు, హార్డ్‌వేర్, కీలక అప్లికేషన్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి పరిస్థితి తగ్గినట్లైంది.
































