పండ్లు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. ప్రతి పండు మన ఆరోగ్యానికి ఎంతో కొంత ఖచ్చితంగా మేలు చేస్తుంది. అందుకే చాలామంది తమ రోజును పండ్లతో ప్రారంభిస్తారు.
దాదాపు అన్ని పండ్లు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో ముఖ్యమైన పండ్లలో జామ ఒకటి.
జామ రుచికి భలేగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, బి6, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. జామలో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది.
జామలో ఉండే పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక.
జామలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం కలిగించి ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
































