11 దేశాల గుండా ప్రవహించే నది.. ఎక్కడ ఉందో తెలుసా..?

నం నిత్యం ఎన్నో విషయాలు చూస్తుంటాం, వింటుంటాం. కానీ వాటి వెనుక ఉన్న వాస్తవాలు, చరిత్ర గురించి మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. పాఠశాలల్లో నేర్చుకున్న కొన్ని విషయాలు కాలంతో పాటు మనం మరిచిపోతుంటాం.


అయితే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవడం అవసరం. అలాంటి ఆసక్తికరమైన అంశాల్లో ఒకటి.. ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏది అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం నైల్ నది. ఈ నది భూగోళ శాస్త్రంలోనే కాకుండా, చరిత్రలో కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినది.

నైల్ నది ఎక్కడ ఉంది?

నైల్ నది ఆఫ్రికా ఖండంలో ఉంది. ఇది మొత్తం 11 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఈ దేశాలలో ఈజిప్ట్, సూడాన్, దక్షిణ సూడాన్, ఉగాండా, ఇథియోపియా, రువాండా, టాంజానియా, బురుండి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఎరిట్రియా, కెన్యా ఉన్నాయి. ఈ నది మొత్తం పొడవు సుమారు 6,690 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన నదిగా పేరుగాంచింది.

చరిత్రలో నైల్ నది ప్రాముఖ్యత

నైల్ నది కేవలం దాని పొడవుతోనే కాకుండా దాని ఒడ్డున వికసించిన గొప్ప నాగరికతలతో కూడా ప్రసిద్ధి చెందింది. ఈజిప్ట్ పురాతన నాగరికత నైల్ నది వల్లనే అభివృద్ధి చెందింది. ఈజిప్షియన్ల వ్యవసాయం, వాణిజ్యం, జీవనం పూర్తిగా ఈ నదిపై ఆధారపడి ఉండేది. ప్రతి సంవత్సరం నైలు నది పొంగివచ్చి, సారవంతమైన మట్టిని తెచ్చేది. దీని వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయం సులభమయ్యేది.

ఫరోలు నిర్మించిన పిరమిడ్లు, దేవాలయాలు, ఇతర స్మారక కట్టడాలు అన్నీ ఈ నది ఒడ్డున లేదా దానికి దగ్గరలోనే ఉన్నాయి. అందుకే ఈజిప్ట్‌ను నైల్ నది వరం అని పిలుస్తారు. ఈ నది గిరిజన తెగల జీవనానికి, సంస్కృతికి కూడా కేంద్రంగా నిలిచింది.

నేటికీ ప్రాముఖ్యత తగ్గలేదు

ఆధునిక కాలంలో కూడా నైల్ నది ఆఫ్రికా దేశాల ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి చాలా ముఖ్యమైనది. ఈ నది నీటిని వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, రవాణా కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీని ఒడ్డున ఉన్న దేశాలకు ఇది ఒక జీవనదిగా నిలిచి, లక్షలాది మంది ప్రజలకు జీవనోపాధిని అందిస్తోంది. నైల్ నది గురించిన ఈ వాస్తవాలు మన జ్ఞానాన్ని పెంచడమే కాకుండా, ఒక నది ప్రపంచంపై ఎంత ప్రభావితం చేయగలదో కూడా మనకు తెలియజేస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.