హృదయ సంబంధిత వ్యాధుల వల్లే దేశంలో ఎక్కువ మంది చనిపోతున్నారని మీకు తెలుసా..? దాదాపు 31 శాతం మరణాలకు ఇవే ప్రధాన కారణమట. భారత రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలోని మోడల్ రిజిస్ట్రేషన్ సర్వే సమర్పించిన తాజా డేటా ప్రకారం పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
మరణ కారణాలపై వచ్చిన తాజా నివేదిక(2021-2023)లో దేశంలో అధిక మరణాలకు నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు ప్రధాన కారణాలని తెలిపింది. మొత్తం మరణాలలో 56.7 శాతం వీటివల్లే సంభవిస్తున్నాయని వెల్లడించింది.
సంక్రమిత, ప్రసూతి, పెరినాటల్, పోషకాహారలోపం వల్ల 23.4 శాతం మరణాలు కలుగుతున్నాయని సదరు నివేదిక చెబుతోంది. 2020-2022 COVID కాలంలో సంబంధిత మరణాలు వరుసగా 55.7 శాతం, 24.0 శాతంగా ఉన్నాయని తెలిపింది.
హృదయ సంబంధ వ్యాధులే అధిక మరణాలకి ప్రధాన కారణంగా ఉన్నాయని చెప్పిన నివేదిక.. దాదాపు 31 శాతం మంది ఈ కారణంగా చనిపోతే, తరువాత 9.3 శాతం మంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, 6.4 శాతం మంది ప్రాణాంతక, ఇతర నియోప్లాజమ్‌లు, 5.7 శాతం మంది శ్వాసకోశ వ్యాధులు కారణంగా ప్రాణాలు కోల్పోయారని చెప్పింది.
29-30 ఏళ్ల వయస్కులు.. వాళ్ల జీవనశైలి కారణంగా హృదయ సంబంధ వ్యాధులకు గురై చనిపోతున్నారని సదరు నివేదిక చెబుతోంది. ఇక, 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారిలో మరణానికి అత్యంత సాధారణ కారణం ఆత్మహత్యలు.. తదితరాలని పేర్కొంది.
ఇక, ఈ నివేదిక ప్రకారం మరణాలకి ఇతర కారణాలలో జీర్ణకోశ వ్యాధులు 5.3 శాతం, జ్వరాల కారణంగా 4.9 శాతం, ప్రమాదాల బారినపడి 3.7 శాతం, డయాబెటిస్ మెల్లిటస్ కారణంగా 3.5 శాతం, జెనిటూరినరీ వ్యాధుల కారణంగా 3.0 శాతం మంది చనిపోతున్నట్టు సదరు నివేదిక వెల్లడించింది. 10.5 శాతం మరణాలు వృద్ధాప్యం(70 ఏళ్లు, లేదా అంతకంటే ఎక్కువ) కారణంగా సంభవిస్తున్నాయని సదరు నివేదికలు చెబుతున్నాయి.
































