మీరు యూపీఐ పేమెంట్స్ చేస్తారా.? అయితే మీకో శుభవార్త

www.mannamweb.com


ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌ భారీగా పెరిగాయి. దేశంలో డిజిటల్‌ చెల్లింపులకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. చిన్న చిన్న మొత్తాలు మొదలు పెద్ద అమౌంట్స్‌ వరకూ యూపీఐ పేమెంట్ విధానాన్నే ఉపయోగిస్తున్నారు.

దీంతో యూపీఐ చెల్లింపుల విషయంలో తాజాగా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక ప్రకటన చేశారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ విషయంలో ముఖ్యమైన ప్రతిపాదనలు చేపట్టినట్లు వెల్లడించారు.

గురువారం ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల వెల్లడి సందర్భంగా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. యూపీఐ ద్వారా ట్యాక్స్‌ చెల్లించే వారికి శుభవార్త తెలిపారు. యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని పెంచనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రూ.1 లక్షను రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఫలితంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు రూ.లక్షకు మించి పన్ను చెల్లించాల్సిన వారు క్రెడిట్ లేదా డెబిట్‌ కార్డులను ఉపయోగించే వారు. లేదా బ్యాంకుకు వెళ్లి పే చేసేవారు. దీంతో ఓటీపీ వివరాలు అందించడం, కార్డు వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉండేది. అయితే.. యూపీఐ చెల్లింపుల వల్ల అలాంటి ఇబ్బందులేవీ ఉండవు. కేవలం పిన్‌ ఎంటర్‌ చేసి ట్యాక్స్‌ పే చేసే అవకాశం లభిస్తుంది. కాగా గతంలోనూ యూపీఐ చెల్లింపుల లిమిట్‌ను గతంలోనూ పెంచిన విషయం తెలిసిందే.

2023 డిసెంబరులోనే వైద్య ఖర్చులు, విద్యాసంస్థల్లో ఫీజులను యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశాన్ని కల్పించింది. అంతకుముందు క్యాపిటల్‌ మార్కెట్లు, బీమా, విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌ల చెల్లింపుల పరిమితిని సైతం రూ.2 లక్షలు చేసింది. మరోవైపు ఐపీఓల్లో పెట్టుబడి, రిటైల్‌ డైరెక్ట్‌ స్కీముల్లోనూ ఒక్క లావాదేవీకి యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

త్వరలోనే డెలిగేటెడ్‌ వ్యవస్థ..

త్వరలో యూపీఐలో డెలిగేటెడ్ చెల్లింపుల వ్యవస్థను తీసుకోస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. దీంతో ఒక వ్యక్తి తన ఖాతా నుంచి మరొక వ్యక్తి ట్రాన్సాక్షన్స్‌ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వొచ్చు. ఇందుకోసం రెండో వ్యక్తి బ్యాంక్‌ ఖాతా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇది ఉపయోగపడుతుంది. దీంతో తండ్రి తన ఖాతా నుంచి యూపీఐ చెల్లింపులు చేసేందుకు పిల్లలకు అనుమతి ఇవ్వొచ్చన్నమాట. దీంతో డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.