కాంటాక్ట్ లేన్స్‌ను వాడతారా? ఈ పొరపాట్లతో చూపునకు ముప్పు

కళ్లద్దాలను ఇష్టపడని ప్రతి ఒక్కరూ ఏదోక సందర్భంలో కాంటాక్ట్ లెన్స్‌ను ఎంచుకుంటారు. అయితే, సరైన జాగ్రత్తలు పాటించకపోతే కాంటాక్ట్ లెన్స్ వల్ల కంటి చూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో వైద్యులు సవివరంగా చెబుతున్నారు. మరి ఇవేమిటో తెలుసుకుందాం పదండి (Ophthalmologist Advice for Lens Wearers).


కాంటాక్ట్ లెన్స్ వాడేవారికి మైక్రోబియల్ కెరాటైటిస్‌తో ముప్పు పొంచి ఉంటుంది. ఇది కార్నియాకు సోకే ఇన్ఫెక్షన్. దీని వల్ల ఒక్కోసారి కంటి చూపు కోల్పోవాల్సి వస్తుంది.

వైద్యులు చెప్పేదాని ప్రకారం, లెన్స్‌ను సరిగా శుభ్రపరుచుకోకపోతే బ్యాక్టీరియా, ఫంగస్, అమీబా లాంటి హానికారక సూక్ష్మక్రిములు వాటిపై చేరతాయి. ఇక కంట్లో లెన్స్ పెట్టుకునేటప్పుడు లేదా తీసేటప్పుడు కార్నియాపై సహజసిద్ధంగా ఉండే రక్షణ పొరకు సూక్ష్మస్థాయిలో గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో లెన్స్‌పై ఉన్న హానికారక క్రిములు కంటిలోకి చేరి ఇన్‌ఫెక్షన్ కలుగ జేసే అవకాశం ఉంది.

లెన్స్‌ను వాడేటప్పుడు చేయకూడని పొరపాట్లు

  • చేతులు శుభ్రపరుచుకోకుండా లెన్స్‌ను తాకకూడదు. అలాగే పాత క్లీనింగ్ సొల్యూషన్స్‌ను మళ్లీ మళ్లీ వాడకూడదు.
  • కాంటాక్ట్ లెన్స్‌ను ధరించి రాత్రిళ్లు నిద్రపోతే కార్నియాకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో, ఇన్‌ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది. కళ్లు పొడిబారిపోతాయి.
  • స్విమ్మింగ్ చేసేటప్పుడు లేదా స్నానం చేసేటప్పుడు కాంటాక్ట్ లెన్స్ ధరించకూడదు. ఇలాంటి సందర్భాల్లో నీటిలోని బ్యాక్టీరియాతో ఇన్‌ఫెక్షన్లు కలుగుతాయి.
  • ఎక్కువ సేపు కాంటాక్ట్ లెన్స్‌ను వాడితే వాటిపై పేరుకునే బ్యాక్టీరియా వల్ల కంటి ఇన్‌ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • కాంటాక్ట్ లెన్స్‌ను తాకే ముందు ప్రతిసారీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  • తాజా డిస్‌ఇన్‌ఫెక్టెంట్ సొల్యూషన్‌తోనే లెన్స్‌ను శుభ్రపరచాలి.
  • రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తప్పనిసరిగా కాంటాక్ట్ లెన్స్‌ను తొలగించాలి
  • కంటి వైద్యుల సూచనల మేరకు పాత కాంటాక్ట్ లెన్స్‌ను పారేసి కొత్త వాటిని తీసుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌లను ముందుగానే పసిగట్టేందుకు క్రమం తప్పకుండా కంటి చెకప్‌లు చేయించుకోవాలి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.