సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కలలుకంటుంటారు. ఇంధ్రవనం లాంటి ఇల్లు కాకున్నా కనీసం రెండు గదుల ఇల్లు కట్టుకోవాలని కష్టపడుతుంటారు. తమ కలల సౌదం కోసం తాపత్రయపడుతుంటారు. తమకు నచ్చిన డిజైన్ లో ఇల్లు నిర్మించుకుని ఊపిరి ఉన్నంత వరకు అందులో జీవించాలని కోరుకుంటారు. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు పైసా పైసా కూడ బెట్టుకుంటున్నారు. కానీ, ఓ వైపు నిత్యావసర ధరలు పెరగడం, పిల్లల స్కూలు ఫీజులు ఇవన్నీ కలుపుకుని ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. దీంతో ఇల్లు కట్టుకోవడం కష్టతరమైపోతోంది. దీంతో సొంతింటి కల కలగానే మిగిలిపోతున్నది. ఇప్పటికీ దేశంలో ఇళ్లు లేని వారు ఎంతో మంది ఉన్నారు. అద్దె ఇళ్లల్లో ఉంటూ జీవితాలను గడుపుతున్నారు. ఇలాంటి పేదలకు సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి.
ఇల్లు నిర్మాణాల కోసం వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి 4 లక్షలు అందిస్తోంది. మరి మీరు కూడా కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? కేంద్రం అందించే ఈ ఆర్థిక సాయాన్ని ఉపయోగించుకుని మీ సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చేతిలో కొంత డబ్బు ఉన్నా కూడా లోన్ తీసుకోకుండా పూర్తవదు. మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుంది. పేదవారికి ఇది తలకు మించిన భారం అవుతుంది. కాబట్టి ఇలాంటి వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ పథకం ద్వారా కేంద్రం 2.5 లక్షలు అందిస్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 1.5 లక్షలు లబ్ధిదారులకు అందించాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. అంటే కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు రూ. 4 లక్షలు పొందొచ్చన్నమాట. ఈ డబ్బుతో మీ సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. 2024-25 సంవత్సరంలో అమలు కానున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) 2.0 పథకం మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పట్టణాల్లో పీఎంఏవై 2.0 కింద 2024-25లో దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అర్హులు ఎవరంటే.. దరఖాస్తుదారుడు భారతదేశ నివాసి అయి ఉండాలి. శాశ్వత ఇల్లు కలిగి ఉండకూడదు. వార్షిక ఆదాయం 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య ఉండాలి. ఆధార్ కార్డు, పాస్ పోర్టు, ఫోటో జాబ్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, స్వచ్ఛ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నంబర్, ఉపయోగంలో ఉన్న ఫోన్ నెంబర్, ఇన్ కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అలానే 18 ఏళ్లు పైబడిన వాళ్లు, తప్పనిసరిగా భారతదేశ నివాసం ఉన్న వాళ్లు ఈ స్కీమ్ కి అర్హులు. రేషన్ కార్డు బిపిఎల్ జాబితాలో పేరు ఉండాలి. అన్ని అర్హతలున్నవారు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.