రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు.. అధికారులకు చంద్రబాబు

www.mannamweb.com


గిరిజన మహిళల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇకపై డోలీ మోతలు కనిపించకూడదని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. నెలలు నిండిన గర్భిణీల కోసం గతంలో తెలుగు దేశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. గిరిజన మహిళల సౌకర్యం కోసం ట్రైకార్‌, జీసీసీ, ఐటీడీఏలను యాక్టివేట్‌ చేయాలని సూచించారు. ఈ సంస్థల కార్యకలాపాల వేగం పెంచాలని సూచించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్ లను తిరిగి ప్రవేశ పెట్టాలని ఆదేశించారు.

డోలీ మోతలపై మానవీయకోణంలో ఆలోచించి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు సీఎం. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈసమావేశంలో మంత్రి సంధ్యారాణి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అరకు కాఫీ అమ్మకాలు, మార్కెటింగ్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందన్నారు సీఎం. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రొత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. వాటిని సమగ్రంగా ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎంతో సారవంతమైన భూములను ఉపయోగించుకొని పకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. కేంద్రం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి.. రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. గిరిజనుల తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలు సేకరించి.. రావాలని ముఖ్యమంత్రి సూచించారు.