ప్రమాణ స్వీకారం తర్వాత డోనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన మార్క్ చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
రాబోయే సంవత్సరాల్లో అమెరికా వైఖరి ఎలా ఉంటుందో ట్రంప్ మొత్తం ప్రపంచానికి ఒక దృక్పథాన్ని ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోలపై సుంకాలను ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికోలపై అమెరికా 25 శాతం సుంకాన్ని విధిస్తుందని ట్రంప్ అన్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే రికార్డు స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లపై సంతకం చేస్తున్నారు. రాబోయే కాలంలో అమెరికా, భారతదేశం మధ్య సంబంధం మరింత బలపడుతుందని రెండు దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు, ట్రంప్ భారత్‌కు దగ్గరగా ఉన్నట్లు తెలిసింది. మోడీ, ట్రంప్ మధ్య స్నేహం రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలకు దారితీస్తుందని అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ట్రంప్ ఇద్దరు కుమారులు త్వరలో భారతదేశానికి వస్తారని తెలుస్తోంది. భారతదేశంలో నిర్మిస్తున్న ఐకానిక్ “ట్రంప్ టవర్స్” ప్రాజెక్టులను వారు ప్రారంభిస్తారని సమాచారం. ముంబై, హైదరాబాద్, గురుగ్రామ్, బెంగళూరు, నోయిడాలో ప్రాజెక్టులను ప్రారంభించడానికి ట్రంప్ కుమారులు వస్తారని తెలుస్తోంది. భారతదేశంలో నిర్మిస్తున్న ట్రంప్ టవర్ల సంఖ్య అమెరికాలోని ట్రంప్ టవర్ల సంఖ్యను అధిగమించబోతోంది. అమెరికా వెలుపల అత్యధిక ట్రంప్ టవర్లు ఉన్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉండబోతోంది.
మొత్తం కొత్తగా ఆరు ప్రాజెక్టులను ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టుల్లో గోల్ఫో కోర్సు, విల్లాలు కూడా ఉంటాయి. 2025 నాటికి భారత్, జపాన్‌ని అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందన్న వాస్తవం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌లో ట్రంప్ కుటుంబ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ట్రంప్ టవర్స్ ఇప్పటికే ముంబై, పూణే, గుర్గావ్, కోల్‌కతాలో ఉన్నాయి. ఈ నాలుగు నివాస ట్రంప్ టవర్లు రాబోయే ఆరేళ్లలో 10కి పెరగనున్నాయి. నోయిడా, హైదరాబాద్, బెంగళూర్, ముంబై, గుర్గావ్, పూణేలో కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కనన్నాయి. భారతదేశంలోని నాలుగు ట్రంప్ టవర్లు 3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 800 లగ్జరీ నివాసాలతో రూ. 6 కోట్ల నుండి రూ. 25 కోట్ల మధ్య ధరను కలిగి ఉన్నాయి. మొత్తం అమ్మకపు విలువ రూ. 7,500 కోట్లుగా అంచనా. హైదరాబాద్, బెంగళూర్ సహా ఆరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. వీటి అంచనా అమ్మకాల విలువ రూ. 15000 కోట్లు. 2017లో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడానికి ముందు, లోధా, పంచ్‌షిల్ అండ్ ట్రిబెకా డెవలపర్స్ వంటి డెవలపర్‌లతో ఒప్పందాల ద్వారా ముంబై, పూణే, గుర్గావ్, కోల్‌కతాలో నాలుగు ట్రంప్ టవర్లు పూర్తయ్యాయి.