అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. విద్యా శాఖను మూసివేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం విద్యా శాఖను మూసివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేస్తారని, ఇది కీలకమైన ప్రచార హామీని నెరవేరుస్తుందని వైట్ హౌస్ ఒక ఫ్యాక్ట్ షీట్‌లో తెలిపింది.
విద్యా శాఖను మూసివేయడానికి, విద్యా అధికారాన్ని రాష్ట్రాలకు తిరిగి ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యా కార్యదర్శి లిండా మెక్‌మహాన్‌ను ఆదేశిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రభావవంతంగా, అంతరాయం లేని సేవలు, కార్యక్రమాలు, ప్రయోజనాల కొనసాగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ చర్యను డెమోక్రటిక్ రాష్ట్ర అటార్నీ జనరల్ బృందం ఇప్పటికే సవాలు చేసింది. విద్యా శాఖను ట్రంప్ కూల్చివేయకుండా నిరోధించాలని, గత వారం సిబ్బందిలో దాదాపు సగం మందిని తొలగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ వారు దావా వేశారు.