బైపాస్‌కు భయపడొద్దు.. గుండె భద్రతే ముఖ్యం

యసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో యుక్త వయసు వారే ఎక్కువగా గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. చికిత్స తీసుకోని వారి పరిస్థితి అలా ఉంచితే.. స్టెంట్లు వేయించుకుని, బ్లాక్స్‌ను తొలగించుకున్న రోగులు సైతం గుండెపోటు మరణాలకు గురవుతుండటం బాధాకరం.


కొంతమంది రోగులు, వారి కుటుంబ సభ్యులు గుండె ఆపరేషన్‌ అంటేనే భయపడిపోతారు. అలాంటి వారు ఎక్కువగా యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్‌ వేయించుకునేందుకే ఇష్టపడతారు. ఈ క్రమంలో కొంతమంది రోగులు ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా స్టెంట్లనే వేయించుకుంటారు. మరి ఈ స్టెంట్లు గుండె ఆరోగ్యాన్ని ఎంతవరకు కాపాడతాయి…? ఎలాంటి సందర్భంలో యాంజియోప్లాస్టీ చికిత్స మంచి ఫలితాలను ఇస్తుంది? బైపాస్‌ సర్జరీ ఏ సందర్భంలో చేయించుకోవాలి? తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.

అమెరికన్‌ మార్గదర్శకాల ప్రకారం.. మూడు ఆర్టరీ సమస్యలు, డయాబెటిస్‌, లెఫ్ట్‌మెన్‌ డిసీజ్‌ ఉన్నవారికి బైపాస్‌ ఉత్తమం. సీఏబీజీ ద్వారా మంచి ఫలితాలు ఉండటంతోపాటు భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండెపోటు కారణంగా కార్డియాక్‌ అరెస్ట్‌ ఏర్పడి రోగి అకస్మాత్తుగా మృత్యువాత పడతాడు. అయితే ఈ రక్తనాళాల్లో ఏర్పడిన అవరోధాలను అంటే బ్లాక్స్‌ను తొలగించేందుకు సాధారణంగా రెండు రకాల చికిత్సా పద్ధతులను అవలంబిస్తారు. ఒకటి యాంజియోప్లాస్టీ, రెండు బైపాస్‌ సర్జరీ. ఈ రెండు చికిత్సా పద్ధతులు రోగి ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.

బ్లాక్స్‌ అంటే..

మనిషి గుండె యంత్రం లాంటిది. ఒక యంత్రం పనిచేయాలంటే ఇంధనం ఎలా అవసరమో.. గుండె పనిచేయడానికి ఆక్సిజన్‌, న్యూట్రిషన్స్‌ అవసరం. గుండెకు కావల్సిన ఆక్సిజన్‌, న్యూట్రిషన్స్‌ రక్తం ద్వారా అందుతుంది. సహజంగా ప్రతి హార్ట్‌ బీట్‌కి గుండెకు రక్తం సరఫరా అవుతుంది. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ క్రమంలో నిమిషానికి 72 సార్లు గుండె నుంచి కరోనరీ ధమనుల ద్వారా గుండె కండరాలకు రక్తం సరఫరా అవుతుంది. అదే సమయంలో గుండె నుంచి శరీరానికి బృహద్ధమని ద్వారా రక్తం సరఫరా అవుతుంది. గుండె కొట్టుకుంటుంటే నిమిషానికి 5 లీటర్ల చొప్పున రక్తం శరీరానికి సరఫరా అవుతుంది. గుండెకు రెండు కరోనరీ ధమనుల ద్వారా రక్తం సరఫరా అవుతుంది. అందులో ఒకటి ఎడమ కరోనరీ ధమని. ఇది పెద్దగా ఉంటుంది.

ఈ ధమని మళ్లీ రెండుగా విడిపోతుంది. అందులో ఒకటి గుండె ముందుభాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. మరొకటి గుండె ఎడమ భాగానికి రక్తాన్ని అందిస్తుంటుంది. కుడి ధమని మాత్రం గుండె కుడి భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈ రెండు కరోనరీ ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల పూడికలు ఏర్పడినప్పుడు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఈ విధంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో రక్తప్రసరణ జరగకుండా పూడికలు ఏర్పడటాన్నే బ్లాకేజ్‌ లేదా బ్లాక్‌లు అంటారు. ఇలా బ్లాక్‌లు ఏర్పడినప్పుడు గుండెకు రక్తసరఫరా సరిగ్గా జరగకపోవడంతో ఆక్సిజన్‌ సరఫరా మందగిస్తుంది. దీని వల్ల గుండెపోటు వస్తుంది.

బ్లాకేజ్‌ లక్షణాలు

  • ఛాతీ ఎడమ భాగంలో నొప్పి.
  • ఎడమ భుజం లేదా ఎడమ చేయి లాగడం లేదా నొప్పిగా ఉండటం.
  • ఛాతీ మధ్య బాగంలో నొప్పి రావడం.
  • కడుపు పైభాగంలో ఆయాసంగా అనిపించడం.
  • కింది దవడ వద్ద నొప్పి.
  • గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం

నిర్ధారించే పరీక్షలు

  • ఈసీజీ
  • ట్రెడ్‌ మిల్‌ పరీక్ష లేదా ఎక్సైర్‌సైజ్‌ ఈసీజీ ద్వారా గుర్తించవచ్చు
  • ఇకో కార్డియోగ్రఫి కరోనరీ యాంజియోగ్రామ్‌ ద్వారా బ్లాక్‌లను గుర్తించవచ్చు. దీని ద్వారా 100 శాతం నిర్ధారణ జరుగుతుంది.

యాంజియోప్లాస్టీ అంటే..

కొవ్వు లేదా రక్తం గడ్డ కట్టడం వల్ల మూసుకుపోయిన గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాన్ని (ధమని) తెరవడానికి ఉపయోగించే వైద్య ప్రక్రియనే యాంజియోప్లాస్టీ అంటారు. ఈ పద్ధతిలో ఒక సన్నని గొట్టం (కాథెటర్‌) ద్వారా రక్తనాళంలోకి చిన్న బెలూన్‌ను పంపించి, దాన్ని ఉబ్బించి రక్త ప్రవాహాన్ని సరిచేస్తారు. అంటే బెలూన్‌ను ఉబ్బించడం వల్ల మూసుకుపోయిన రక్తనాళం తెరుచుకుంటుంది. దీనినే ‘ధమని విస్తరణ’ లేదా ‘రక్తనాళ విస్తరణ’ అని కూడా అంటారు. ఈ రక్తనాళం మళ్లీ మూసుకుపోకుండా ఉండేందుకు ఒక స్ప్రింగ్‌లాంటి పరికరాన్ని అమరుస్తారు. దానినే ‘స్టెంట్‌’ అంటారు. ఛాతీలో నొప్పి వచ్చిన మొదటి ఆరు గంటల్లో ఈ యాంజియోప్లాస్టి చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే అన్ని సందర్భాలలో యాంజియోప్లాస్టీ చేయడం సరికాదు. చాలామంది రోగులు, వారి కుటుంబ సభ్యులు బైపాస్‌ సూచనలు ఉన్నప్పుడు కూడా స్టెంట్‌ వేయమని వైద్యులను కోరుతుంటారు. రోగి బంధువులు మెడికల్‌ పరంగా కాకుండా ఎమోషనల్‌గా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

యాంజియోప్లాస్టీ ఎప్పుడంటే..

  • ఒకే ధమని (రక్తనాళం)లో బ్లాక్స్‌ ఉంటే యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్‌ వేయవచ్చు.
  • యుక్తవయసు వారిలో కొవ్వు స్థాయులు తక్కువగా ఉండి, షుగర్‌ లేని వారికి స్టెంట్‌ వేయవచ్చు.
  • హార్ట్‌ పంపింగ్‌ చక్కగా ఉంటే అంటే (ఇంజెక్షన్‌ ఫ్రాక్షన్‌) సాధారణంగా ఉన్న వారిలో యాంజియోప్లాస్టీ చేయవచ్చు.
  • లెఫ్ట్‌మెన్‌ డిసీజ్‌ లేకుండా ఉన్న వారికి కూడా యాంజియోప్లాస్టీ సూచించవచ్చు.

బైపాస్‌ అంటే…

సాధారణంగా బైపాస్‌ అంటే ఒక మార్గానికి మరో ప్రత్యామ్నాయ మార్గం అని అర్థం. అయితే గుండెకు సంబంధించిన రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని ఏర్పాటు చేయడమే బైపాస్‌ సర్జరీ. ఈ శస్త్రచికిత్సలో రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్‌ను తీయకుండా కొత్తగా మరో మార్గం ద్వారా రక్తప్రసరణను మళ్లిస్తారు.

సాధారణంగా ఒకే రక్తనాళంలో బ్లాక్‌ ఉంటే స్టెంట్‌ వేస్తారు. అది కూడా రెండు సెంటీమీటర్ల లోపు పొడవు ఉంటే మాత్రమే స్టెంట్‌ వేయడానికి వీలుంటుంది. రక్తనాళం ప్రారంభంలో (ఆస్టియల్‌ స్టెనోసిస్‌) బ్లాక్‌ ఉంటే స్టెంట్‌ వేసే అవకాశం ఉండదు. అంతేకాకుండా క్రానిక్‌ టోటల్‌ అక్లూషన్‌ (రక్తనాళం మొత్తం బ్లాక్‌ కావడం) అయితే కూడా స్టెంట్‌ వేయడానికి అనుకూలత చాలా తక్కువ. ఈ సందర్భాలలో బైపాస్‌ సర్జరీ చేయాల్సిందే!

ఎక్కువ బ్లాక్‌లు ఉంటే..

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో 50 శాతం పూడికలు ఏర్పడితే ఛాతీ నొప్పి, ఇతర వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. మూడు ధమనుల్లో బ్లాక్స్‌ ఏర్పడితే దానిని ట్రిపుల్‌ వెసల్‌ డిసీజ్‌ అంటారు. ఈ మూడు ధమనుల్లో కూడా 70 శాతం కంటే ఎక్కువ బ్లాకేజస్‌ ఉండి, ఎడమ ప్రధాన ధమనిలో 50 శాతం కంటే ఎక్కువ బ్లాక్‌లు ఉండి.. రోగికి ఛాతీ నొప్పి వచ్చినప్పుడు బైపాస్‌ సర్జరీ అవసరం ఏర్పడుతుంది.

ఈ రెండు సందర్భాలలో..

బైపాస్‌ సర్జరీని బ్లాక్‌లు ఏర్పడినప్పుడే కాకుండా గుండెపోటుతోపాటు వీఎస్‌డీ (మెకానికల్‌ కాంప్లికేషన్స్‌) వంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఎడమ కవాటం లీకైనప్పుడు, వాల్వు లీకైనప్పుడు (మైట్రల్‌ రిగర్జిటేషన్‌), లెఫ్ట్‌ వెంట్రిక్లర్‌ ఎన్యూరిజం వచ్చిన సందర్భాల్లో కూడా బైపాస్‌ చేస్తారు.

బైపాస్‌ సర్జరీ పద్ధతి

సాధారణంగా బైపాస్‌ శస్త్రచికిత్స కోసం శరీరంలోని రక్తనాళాలను వినియోగిస్తారు. ఇందుకోసం ధమనులు లేదా కాళ్లలో ఉన్న సిరలను వినియోగిస్తారు. ధమనుల్లో ఎడమ పక్కన ఉన్న రొమ్ము ధమనిని తీసి గుండె ముందు వైపున ఉన్న ఎల్‌ఏడీ ధమనికి వేస్తారు. మిగిలిన ధమనులకు కాలు నుంచి తీసిన సిరలను వేస్తారు. కాలు నుంచి తీసిన సిరలు 12 నుంచి 15 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి. ఈ క్రమంలో 10 సంవత్సరాలు గడిచిన తరువాత మళ్లీ గుండెకు వేసిన సిరల గ్రాఫ్ట్‌ల్లో బ్లాక్‌లు ఏర్పడే అవకాశాలు అధికం. దీనివల్ల రెండోసారి బైపాస్‌ సర్జరీ అవసరం పడుతుంది. మొదటి సారి బైపాస్‌ చేయించుకున్న వారిలో 10 సంవత్సరాల తరువాత 10 శాతం, 15 సంవత్సరాల తరువాత 15-20 శాతం మందికి బైపాస్‌ అవసరం పడుతుంది. రెండోసారి బైపాస్‌ సర్జరీలో కుడి రొమ్ము ధమని లేదా రేడియల్‌ ఆర్టరీ (మణికట్టు ధమని)ని వేయడం జరుగుతుంది. లేదా మరో కాలులో ఉన్న సిరలను తీసి వాడతారు.

రెండు పద్ధతులు

ఈ బైపాస్‌ సర్జరీని రెండు పద్ధతుల్లో చేస్తారు. అందులో ఒకటి ఆన్‌ పంప్‌ విధానం. దీనిలో హార్ట్‌ లంగ్‌ మిషన్‌ను ఉపయోగించి గుండె స్పందనను నిలిపి, బైపాస్‌ సర్జరీ చేస్తారు. రెండో పద్ధతిలో స్పందించే గుండె (బీటింగ్‌ హార్ట్‌)పై బైపాస్‌ సర్జరీ చేస్తారు. ఇది ఇటీవల వచ్చిన ఆధునిక పద్ధతి. మన దేశంలో అధికంగా ఈ బీటింగ్‌ హార్ట్‌ పద్ధతిలోనే 60 శాతం మందిరోగులకు బైపాస్‌ సర్జరీలు చేస్తున్నారు.

ఈ సందర్భాలలో బైపాస్‌ ఉత్తమం

  • మూడు ధమనుల్లో అవరోధాలు ఉన్నప్పుడు
  • లెఫ్ట్‌మెయిన్‌ డిసీజ్‌ ఉన్న వారికి…. (ఎడమ ప్రధాన ధమనిలో బ్లాక్‌ ఉన్న వారు)
  • షుగర్‌తో పాటు ఒకటి కంటే ఎక్కువ బ్లాక్‌లు ఉన్నప్పుడు
  • గుండె పంపింగ్‌ తక్కువగా ఉండి, గుండె కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు బైపాసే ఉత్తమం.
  • ఇదివరకు స్టెంట్స్‌ వేసినప్పటికీ గుండెలో నొప్పి వంటి లక్షణాలు ఉన్నప్పుడు బైపాసే మార్గం.

ప్రయోజనాలు

  • దీర్ఘకాలం ఉపశమనం.
  • తరచూ దవాఖానలో చేరే పరిస్థితులను తగ్గిస్తుంది.
  • మరోసారి గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
  • షుగర్‌తో పాటు ఎక్కువ బ్లాకేజ్‌ సమస్య ఉన్నవారిలో మంచి ఫలితాలు ఇస్తుంది.
  • గుండెకు మెరుగైన రక్త సరఫరాను అందిస్తుంది
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.