యువత విదేశీ వస్తువుల మోజును తగ్గించుకోవాలని, ఇంటికి వాటిని తెచ్చుకునే సంస్కృతిని వదిలేయాలని, స్వదేశీ ఉత్పత్తులను ఆదరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
యువతకు భారీగా ఉద్యోగావకాశాల కల్పనపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. స్వయం సమృద్ధి అనేది నేటి ప్రపంచంలో తప్పనిసరని అభిప్రాయపడ్డారు. యువత దేశీయ ఉత్పత్తులను ఆదరించాలని కోరారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
‘ఆపరేషన్ సిందూర్ ఒక్కటే దేశభక్తికి చిహ్నం కాదు. స్వదేశీ వస్తువులనే విక్రయిస్తామని వ్యాపారులు నిర్ణయం తీసుకోవడంద్వారా దేశభక్తిని చాటుకోవాలి. స్కిల్ ఇండియా ద్వారా కోట్ల మంది యువత నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా మారుతున్నారు. ప్రస్తుత ప్రపంచం వృద్ధాప్య సమస్యను ఎదుర్కొంటోంది.
చాలా దేశాలకు యువత కావాలి. ప్రపంచం మొత్తానికి యువ మానవ వనరులను అందించగలిగే సత్తా భారత్‌కు ఉంది. మీరు నైపుణ్యం కలిగిన యువత అయితే.. పలు ఉపాధి అవకాశాలున్నాయి.
వారు స్వయం సమృద్ధి సాధించగలరు. ఇది వారికి శక్తినిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంది. అంటే దేశీయ ఉత్పత్తులనే వినియోగించాలి. స్వదేశీ ఉద్యమం మన భవిష్యత్తును బలపరుస్తుంది’ అని వివరించారు.
































