జూన్, జులై మాసాల్లో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతాయి. ఈ సీజన్ లో భారీ వర్షాలు పడటంతో నదులు, కాల్వలు, జలాశయాలు పొంగి పొర్లుతుంటాయి. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ప్రకృతి అందాలు తిలకించేందుకు ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. ఎత్తైన కొండల నుంచి ప్రవహించే నీటితో.. అందమైన జలపాతాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణంగా అందమైన జలపాతాలు చూడాలంటే కేరళా, గోవా, కర్ణాటక, తమిళనాడు తో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు. కానీ అందమైన జలపాతాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వాటిని చూసేందుకు ఎంతో మంది పర్యాటకులు ఈ సీజన్ లో వస్తుంటారు. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ జలపాతాల గురించి తెలుసుకుందాం.
బొగత జలపాతాలు :
తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో ఉన్నఆ జలపాతం నయాగార అని కూడా పిలుస్తుంటారు. అందమైన ప్రకృతితో పాటు చుట్టూ ఆకట్టుకునే కొండలు, పచ్చని చెట్లు.. పక్షుల కిల కిలా రావాలతో ఎంతో అందంగా ఉంటుంది. ఈ జలపాతం సమీపంలో బోగటేశ్వర స్వామి ఆలయం ఉంది..పర్యాటకులు ఆక్కడికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. వరంగల్ నుంచి 140 కిలో మీటర్ల దూరం.. హైదరాబాద్ నుంచి 281 కిలో మీటర్ల దూరంలో ఉంది. ములుగు నుంచి 90 కిలో మీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
కుంటాల జలపాతం:
ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరేడికొండ ప్రాంతంలో కడం నదిపై ఉంది.150 మీటర్ల ఎత్తు నుండి నీరు ప్రవహిస్తుంది. రాష్ట్రంలోనే ఎత్తైనది జలపాతం. హైదరాబాద్ నుంచి దాదాపు 271 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. జలపాతాల చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో, అడ్వెంచర్ జంకీలకు ఇది గొప్ప హైకింగ్ ప్రదేశం అనే చెప్పొచ్చు.నది ఉప్పొంగుతున్నప్పుడు ఈ ప్రదేశం అద్భుతమైన దృశ్యాన్ని తలపిస్తుంది.
తలకోన జలపాతం:
ఏపీలో అందమైన జలపాతాలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేవ తలకోన, కైలాసకోన. దేశ వ్యాప్తంగా ఇవి ఎంతో ప్రసిద్ది చెందాయి. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అరణ్యప్రాంతాల్లో ఈ జలపాతాలు చూసేందుక నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. తిరుపతి పుణ్యక్షేత్రానికి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ తలకోన జలపాతం వర్షాకాలంలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఏపీలో అతి పొడవైన జలపాతం. ఈ జలపాతాన్ని భూతల స్వర్గం అని పిలుస్తారు. తిరుపతి నుంచి ఈ జలపాతాలను చూసేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులు కూడా అందుబాటులో తెచ్చారు. తిరుపతి, పీలేరు నుంచి గంట గంటకూ ఆర్టీసీ బస్సులు నడుస్తునే ఉంటాయి.
మల్లెల తీరం జలపాతం:
తెలంగాణలో అందమైన జలపాతాల్లో ఒకటి మల్లెల తీర్థం. నాగర్ కర్నూల్ లోని అమ్రాబాద్ మండలం లో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అడవుల్లో ఉన్న ఈ సుందర జలపాతం చూడటానికి ఏడాది పొడవునా సందర్శకులు వస్తూనే ఉంటారు. నల్లమల అడవుల గుండా కృష్ణా నది ప్రవహిస్తుంది.. ఇది శ్రీశైలం నుంచి 58 కిలో మీటర్లు, హైదరాబాద్ నుంచి 185 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం ఎత్తు దాదాపు 150 అడుగుల. ట్రెక్కింగ్, స్లైడింగ్, రివర్ క్రాసింగ్, క్యాంప్ ఫైర్‌లకు ఈ ప్రదేశం అనుకూలంగా ఉటుంది.. అడ్వంచెర్ కోరుకునే వారు ఈ ప్రదేశానికి తప్పకుండా సందర్శించి తీరాల్సిందే.
గాయత్రి జలపాతం :
తెలంగాణలో మరో అందమైన టూరిస్ట్ స్టాప్ గాయత్రి జలపాతాలు. నిర్మల్ పట్టణం చుట్టూ అనేక జలపాతాల్లో ఒకటి గాయత్రి జలపాతం. సుమారు 70 మీటర్ల ఎత్తులో ఉన్న రాతి కొండ నుంచి కిందకు జాలువారుతున్న ఈ జలపాతం అందాలు చూడలాంటే రెండు కళ్లు సరిపోవు. హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిలో మీటర్ల దూరచంలో ఉన్న నిర్మల్ పట్టణం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోఖ్రం గ్రామంలో ఉంది. అక్కడ నుంచి 5 కిలోమీటర్లు కాలి నడకన వెళ్లాలి.గాయత్రి జలపాతం అందాలు చూడటానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు.
కటిక జలపాతం:
ఆంధ్రప్రదేశ్ విశాఖ పట్నంలో ఉన్న కటిక జలపాతం సుమారు 50 అడుగుల ఎత్తులో ఉంటుంది. బొర్రా గుహల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అరకు సమీపంలో ఉన్న ఈ జలపాతం వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తుంది. జలపాతం చుట్టూ సహజ ప్రకృతి దృశ్యం కన్నుల విందుగా ఉంటుంది. ఇక్కడ ట్రెక్కర్లకు, ట్రెక్కింగ్ కి అనువుగా ఉంటుంది. ఈ జలపాతానికి చేరుకోవడానికి గేట్వల్స నుంచి జీపులు ఇతర వాహనాలు అందుబాటులో ఉంటాయి.
భైరవ కోన జలపాతం :
ఏపీలోని ప్రకాశం జిల్లాలో భైరవ కోన జలపాతం జోరుగా పారుతుంది. వర్షాల సీజన్ లో ఇక్కడ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. సీఎస్ పురం మండలంలోని భైరవ కోన ప్రాంతంలో శైవ క్షేత్రం ప్రసిద్ది పొందింది. ప్రతి ఆదివారం భక్తులు ఎక్కువగా వస్తుంటారు.