నవంబర్ 21 నుంచి కొత్త కార్మిక సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల్లో మార్పులు చేసి కొత్తగా 4 సంస్కరణలను తీసుకొచ్చింది.
ఈ కొత్త కార్మిక కోడ్స్ వల్ల ఉద్యోగులకు తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్స్, పీఎఫ్ సౌకర్యం, ఆరోగ్య బీమా, సకాలంలో శాలరీలు, హెల్త్ చెకప్, కనీస వేతనం వంటి బెనిఫిట్స్ దక్కనున్నాయి. వారానికి 48 గంటల కంటే ఎక్కువ వర్క్ చేస్తే రెట్టింపు వేతనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక ఆ లేబర్ కోడ్స్‌లో లేఆఫ్స్ గురించి కూడా వివరించారు. కంపెనీలు ఇష్టమొచ్చినట్లు ఉద్యోగులను తొలగించకుండా రూల్స్ తీసుకొచ్చారు. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
స్పెషల్ ఫండ్
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫర్‌ఫామెన్స్ బాలేదని చెప్పి ఉన్నట్లుండి తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు నోటీస్ పీరియడ్ లేదా ఒక నెల శాలరీ అడ్వాన్స్‌డ్‌గా ఇచ్చి తొలగిస్తున్నాయి. అయితే ఇప్పటినుంచి అలా కుదరదు. ఇప్పటినుంచి ఉద్యోగులను కంపెనీ ఉన్నట్లుండి తొలగిస్తే తొలగింపు పరిహారమే కాకుండా రీ స్కిల్లింగ్ ఫండ్ చెల్లించాలి. 15 రోజుల వేతానానికి సమానమైన సొమ్మును ఈ ఫండ్‌లో జమ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగిని తొలగించిన 45 రోజుల్లోపు వారి బ్యాంక్ అకౌంట్‌కు వీటిని జమ చేయాలి. ఈ సొమ్ము ఉద్యోగికి తక్షణ సహాయంగా ఉంటుంది. పరిహారం పొందేందుకు ఉద్యోగి ఏడాది సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. అయితే దుష్పవర్తన, పనితీరు లేఆఫ్స్ కిందకు రావని కొత్త కార్మిక సంస్కరణల్లో పేర్కొన్నారు.
పారిశ్రామిక సంబంధాల కోడ్- 2020 కింద ఈ రీ స్కిల్లింగ్ నిధిని కేంద్రం తీసుకొచ్చింది. ఏ రంగంలోని కంపెనీ అయినా ఈ నిబంధనను పాటించాల్సిందే. దీని వల్ల ఉద్యోగులకు లేఆఫ్స్ సమయంలో భద్రత లభించనుంది. కొత్త కార్మిక సంస్కరణలపై దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతుంది. వీటి వల్ల ఉద్యోగులకు చాలా ప్రయోజనం చేకూరడంతో పాటు ఆరోగ్య, ఆర్ధిక భద్రత రెండు కలగనున్నాయి. ఈ కొత్త సంస్కరణ వల్ల కంపెనీలకు లేఆఫ్స్ ప్రక్రియ కష్టతరం కానుంది.































