ఆ నగరంలో తల కిందికి దించితే ఒట్టు.. అందరూ కాదు కొందరు మాత్రమే అలా వ్యవహరిస్తున్నారు. ఆకాశంలో డ్రోన్ కనిపిస్తే చాలు.. గజగజ వణికిపోతున్నారట.
కారణం అలా ఉంచితే.. అమ్మో డ్రోన్ వచ్చేసింది.. తస్మాత్ జాగ్రత్త అంటూ ఉరుకులు పరుగులు పెడుతున్నారు కొందరు. ఈ పరిస్థితి ఉన్నది ఏపీలోని విజయవాడ నగరంలో..
విజయవాడ నగరం నేరాలకు అడ్డా ఇది ఒకప్పటి మాట. ఇప్పుడంతా అభివృద్ది బాటే మనకు కనిపిస్తుంది. దీనితో ఎందరో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చి ఉపాధి పొందుతున్నారు. రోజురోజుకీ నగర జనాభా కూడా పెరుగుతోంది. అయితే పలు చోట్ల గంజాయి బ్యాచ్, బహిరంగంగా మద్యం త్రాగి వచ్చే వారితో నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ఈ క్రమంలో విజయవాడ పోలీసులు ఆధునిక పరిజ్ఞానంతో వారి ఆటకట్టించే ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ సక్సెస్ కావడంతో విజయవాడ నగరం ఇప్పుడు ప్రశాంతంగా ఉందట.
విజయవాడ పోలీసుల వద్ద శాంతి భద్రతల పరిరక్షణకై డ్రోన్స్ ఉన్నాయి. ఈ డ్రోన్స్ తీసుకొని సాయంత్రం కాగానే, నగరబాట పడుతున్నారు పోలీసులు. ప్రధానంగా ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగే వీలు ఉంటుందో, ఎక్కడ నేరాలకు తావిచ్చే ప్రదేశాలు ఉన్నాయో. ఎక్కడ గంజాయి బ్యాచ్ స్థావరాలు ఉంటాయో ముందుగానే తెలుసుకొని, డ్రోన్స్ ను ఎగురవేస్తున్నారట. డ్రోన్స్ ద్వారా అక్కడి దృశ్యాలు చూసిన పోలీసులు, సైలెంట్ గా దాడులు నిర్వహించి వారి ఆటకట్టిస్తున్నారు.
దీనితో అమ్మో డ్రోన్.. అయ్యో డ్రోన్ అంటూ మందుబాబులు, అల్లరి మూకలు పరుగులు పెడుతున్న పరిస్థితి విజయవాడ నగరంలో కనిపిస్తోంది. పోలీసులు తీసుకుంటున్న చర్యలపై నగర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి వంగలపూడి అనితల ఆదేశాల మేరకు పోలీసులు నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. నేరగాళ్ల ఆటకట్టిస్తున్నారు. ఇటీవల డ్రోన్స్ ఫెస్టివల్ సాగిన కార్యక్రమంలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు.. డ్రోన్స్ గురించి మాట్లాడుతూ మనిషి చేయలేని పనులు కూడా, డ్రోన్స్ చేస్తాయని వాటిని వినియోగించుకొనే రీతిలో అవలంబించాలని అన్నారు. ఆ మాట ప్రకారమే విజయవాడ నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు డ్రోన్స్ సహకరిస్తున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలు అధికంగా విజయవాడ నగరంలో ఉండగా, అధికంగా ఇతర జిల్లాల ప్రజలు నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ వద్ద కూడా పోలీస్ పహారా పకడ్బందీగా సాగుతోంది. రైల్వే స్టేషన్ ల వద్ద అసాంఘిక కార్యకలాపాల ఊసే లేకుండా పోయిందట పోలీసులు తీసుకుంటున్న చర్యలకు. పోలీస్ డ్రోన్స్ అలా ఎగిరాయంటే చాలు.. అల్లరి మూకల పరుగులు.. సాగుతుండగా, పోలీసులకు వారి విధులు సులభతరమయ్యాయని పోలీస్ అధికారులు తెలుపుతున్నారు.