మద్యం సేవించి, వాహనం నడపడం చట్ట విరుద్ధమని తెలిసిందే. దీనివల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టినట్లు అవుతుంది. అందుకే ప్రభుత్వాలు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాయి.
ఇందుకోసమే పోలీసులు ఎప్పటికప్పుడు చెకింగ్స్ నిర్వహిస్తూ జరిమానాలను విధిస్తుంటారు. మద్యం సేవించి వాహన నడిపే వారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌ను నిర్వహిస్తారని మనందరికీ తెలిసిందే.
ఇందులో కోసం పోలీసులు చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసి బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లు చేస్తుంటారు. ఈ పరికరంలో వచ్చే రీడింగ్ ఆధారంగా సదరు వ్యక్తి మద్యం సేవించాడో లేదో చెప్పేస్తుంటారు. అయితే మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఏఐ సేవలు విస్తరిస్తున్న తరుణంలో మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిని కూడా ఏఐ టెక్నాలజీతో గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇకపై ఎలాంటి బ్రీత్ అనలైజర్స్ అవసరం లేకుండానే కేవలం వ్యక్తి ముఖ కదలికల ఆధారంగా మద్యం సేవించారో లేదో తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న కొత్త అల్గారిథమ్ ద్వారా 75 శాతం కచ్చితత్వంతో మద్యం సేవించిన వారిని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లతో పాటు కంప్యూటర్ విజన్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్ వారు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. వాహనం నడుపుతున్న వ్యక్తి చూస్తున్న దిశతో పాటు, అతని తల ఏ పొజిషినల్‌లో ఉందో ఏఐ కెమెరా ద్వారా విశ్లేషిస్తారు. ఇందుకోసం పరిశోధకులు సరికొత్త ఏఐ ఆల్గరిథమ్‌ను డిజైన్ చేస్తున్నారు. ఈ ఆల్గరిథమ్ డ్రైవర్ స్టీరింగ్‌ను ఎలా తిప్పుతున్నాడు,
అతని ముఖ కవళికలు ఎలా ఉన్నాయి లాంటివన్ని రికార్డ్ చేస్తుంది.
ఈ టెక్నాలజీతో ఐ ట్రాకింగ్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్‌ల ఆధారంగా ఈ విషయాలను అంచనా వేస్తారని పరిశోధకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ గణంకాల ప్రకారం.. ఏటా జరిగే మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 20 నుంచి 30 శాతం మద్యం సేవించడం వల్లే జరిగాయని చెబుతున్నారు. ఈ కొత్త ఏఐ ఆల్గరిథమ్ ద్వారా రానున్న రోజుల్లో డ్రంక్ డ్రైవ్ కేసులు తగ్గుతాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.