ఇలాంటి దసరా వేడుకులు మీరు ఎప్పుడు చూసి ఉండరు.

www.mannamweb.com


కార్పొరేట్ విద్యా విధానంలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులకు అలనాటి సాంప్రదాయ దసరా వేడుకలను పరిచయం చేసింది శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాల యాజమాన్యం..

ఒకప్పటి సంస్కృతి సంప్రదాయాలను చాటుతూ చిన్నారులు చేసిన ఈ వింతైన దసరా వేడుకలు గ్రామంలోని పెద్దలకు సైతం తమ బాల్యం నాటి జ్ఞాపకాలను గుర్తు చేశాయి. దసరా పండగ అంటే ఆదిపరాశక్తి ఆరాధన. దేవి నవరాత్రులు పేరుతో తొమ్మిది రోజులు రాశి, నక్షత్రాలను బట్టి ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అమ్మవారిని కొలవటంలో, పూజా విధానంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో కొన్ని కొన్ని పద్దతులు, సంప్రదాయాలు ఉంటాయి.

ఉత్తర భారత దేశంలో దాండియా, గర్భా వంటి నృత్యాలు ఉంటాయి. ఇక తెలంగాణాలో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలు, నృత్యాలతో ఆరాధిస్తూ మహిళలు సందడి చేస్తూ ఉంటారు. ఇక ఈ కోవలోనే దేవినవరాత్రులలో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలోని గ్రామాల్లో స్కూల్ విద్యార్థులు బాణాల పండుగను నిర్వహిస్తూ ఉంటారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతి దేవిగా అందరికీ దర్శనం ఇస్తారు. ఆ రోజున ఉపాధ్యాయులు చిన్నారులకు విద్యాబుద్దులు ప్రసాదించాలంటూ పాఠశాలలలో విద్యార్థులతో సరస్వతి పూజను నిర్వహిస్తారు. భక్తి శ్రద్ధలతో సరస్వతి పూజను నిర్వహించిన అనంతరం గ్రామంలోని చిన్నారుల ఇళ్లకు,పెద్దలు ఇండ్లకు వెళ్లి వారి వారి ఇంటి ముందు రంగు రంగుల బాణాలతో ప్రదర్శనలు చేస్తూ “ఏదయా..మీ దయా..మామీద మీకు..” అంటూ వివిధ పాటలతో అలరించి వారి నుండి పప్పు బెల్లాలు, వారిచ్చే కానుకలు సేకరిస్తారు. అలా సేకరించిన పప్పు బెల్లాలను, కానుకలను ఉపాధ్యాయులకు గురు దక్షిణగా సమర్పిస్తారు. అయితే ఈ సంప్రదాయం రాను రాను కనుమరుగైపోయింది. ఈ తరం విద్యార్థులకు ఈ బాణాల పండుగ, సంప్రదాయం అసలు తెలియదు. తాతల కాలంలో జరుపుకునే ఆ సంప్రదాయాన్ని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అవలంగి గ్రామంలోని GBT పాఠశాల యాజమాన్యం మళ్ళీ నేటి తరానికి పరిచయం చేసింది. గత ఇరవై ఏళ్లుగా బాణాల పండుగను ప్రతియేటా దసరా ఉత్సవాల సమయంలో నిర్వహిస్తూ వస్తోంది.