తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు.. మంచిర్యాల, ఆసిఫాబాద్‌లలో కంపించిన భూమి.. రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రత

తెలంగాణలో మరోసారి భూమి కంపించింది. అర్ధరాత్రి వేళ.. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భూకంపం రావడంతో ఆ జిల్లాల్లోని జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాత్రి పూట భూకంపం రావడంతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన ప్రజలు.. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇళ్లల్లో వస్తువులు కదలడం, కింద పడటం జరగ్గా.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో ఇటీవల హైదరాబాద్‌లో ఉదయం భూ ప్రకంపనలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గాజులరామారంలో భూమి కంపించినట్లు స్థానికులు వెల్లడించారు. భూమి కంపించడంతోపాటు భారీ శబ్దం వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రాష్ట్రంలో భూకంపం రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో బుధవారం అర్ధరాత్రి భూమి కంపించినట్లు స్థానికులు వెల్లడించారు.


అయితే ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.9గా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప కేంద్రం మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దుల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు వెల్లడింటారు. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో 3 సెకన్ల పాటు భూమి కంపించినట్లు పేర్కొన్నారు. ఈ భూకంప తీవ్రతకు ఇళ్లల్లో ఉన్న వస్తువులు ఒక్కసారిగా కిందపడ్డాయని వివరించారు.
ఇక అర్ధరాత్రి పూట భూమి కంపించడంతో.. అప్పటివరకు గాఢ నిద్రలోకి జారుకున్న ప్రజలు ఒక్కసారిగా లేచి బయటికి పరుగులు తీశారు. గతంలో తమకు ఎప్పుడూ ఇలాంటి భూకంపం అనుభవం ఎదురుకాలేదని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ భూకంప తీవ్రతకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరోవైపు.. కొన్ని నెలల క్రితం కూడా మంచిర్యాల, ఆదిలాబాద్, కరీంనగర్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన వద్ద భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.

ఈనెల 10వ తేదీన గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని గాజులరామారం మెట్‌ఖాన్‌గూడా ప్రాంతంలో భూమి కంపించింది. ఉదయం 10:10 గంటలకు ఒక్కసారిగా భూమి కంపించిందని.. భారీ శబ్దం కూడా వచ్చినట్లు చెప్పారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌లు నుంచి భయంతో జనం పరుగులు తీశారు. ఈ సమాచారం తెలుసుకుని అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఆ సమయంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.