మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ ను అన్ని భాగాలకు చేరవేయడంలో హీమోగ్లోబిన్ చాలా ముఖ్యమైంది. ఇది ఎర్ర రక్త కణాల్లో ఉండే ఓ ముఖ్యమైన ప్రోటీన్. హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారిలో నీరసం, చర్మం పసుపు రంగులోకి మారడం, తలనొప్పులు, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయంలో సహజంగానే హీమోగ్లోబిన్ పెరగాలంటే కొన్ని మంచి ఆహారాలు తీసుకోవడం అవసరం. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్ ఎక్కువ ఉండే పప్పులు.. అన్ని రకాల పప్పుల్లో ఐరన్ తో పాటు శక్తిని ఇచ్చే ప్రోటీన్లు ఉంటాయి. కందిపప్పు, మినపప్పు, శనగలు లాంటి వాటిలో శరీరానికి కావాల్సిన ఐరన్, ఫోలేట్ బాగా దొరుకుతాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు సహజంగానే పెరుగుతాయి.
పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. అందుకే రక్తహీనత ఉన్నవారికి ఇది చాలా మంచిది. దీన్ని రోజూ ఆహారంలో వాడితే ఎర్ర రక్త కణాలు బాగా ఉత్పత్తి అయి.. హీమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి.
బీట్రూట్ లో ఐరన్ తో పాటు ఫోలిక్ యాసిడ్, మాగ్నీషియం లాంటి చాలా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో, హీమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడుతుంది. బీట్రూట్ ను సలాడ్ గా లేదా జ్యూస్ గా తీసుకోవచ్చు.
దానిమ్మలో ఐరన్ తో పాటు విటమిన్ C కూడా ఎక్కువ ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యలను రాకుండా ఆపడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ ఈ పండు తింటే శరీరంలో రక్తం బాగా తయారవుతుంది.
గుడ్లలో ఉండే ఐరన్, విటమిన్ B12 శరీరానికి కావాల్సిన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. రోజుకు ఒక గుడ్డు తింటే హీమోగ్లోబిన్ పెరగడమే కాదు.. మంచి శక్తి కూడా వస్తుంది.
శనగల్లో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ లాంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. శనగలను వేయించి లేదా ఉడికించి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
గుమ్మడి గింజలు చిన్నగా కనిపించినా ఆరోగ్యానికి మాత్రం చాలా లాభాలు ఇస్తాయి. ఇందులో ఐరన్, మెగ్నీషియం, జింక్ లాంటి ఖనిజాలు ఎక్కువ ఉంటాయి. ఇది హీమోగ్లోబిన్ ను సహజంగా పెంచడానికి సహాయపడుతుంది.
టోఫు శాకాహారులకు ఉత్తమమైన ఐరన్ మూలంగా నిలుస్తుంది. ఇందులో ఉండే పోషకాలు ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన శక్తిని అందిస్తాయి. టోఫును కూరలుగా, సలాడ్లలో వాడుకోవచ్చు.
సాల్మన్, మాకరెల్, సార్డిన్ లాంటి చేపల్లో ఐరన్ తో పాటు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన కొవ్వులు అందించి.. రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిలు సరిగా ఉండే అవకాశం ఉంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
































