డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశిస్తూ కళాశాల విద్యా శాఖ డైరెక్టర్ భరత్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
600 మంది డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకు నోటీసులు
2019 నాటి రెండు నెలల జీతం ఇప్పుడు రికవరీ
ఒక్కో లెక్చరర్ కట్టాల్సిన మొత్తం 60 వేలు
ఐదేళ్ల క్రితం ఇచ్చిన 2 నెలల జీతాలను ఇప్పుడు తిరిగి చెల్లించాలని కళాశాల విద్యా శాఖ డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లను ఆదేశించింది. అప్పట్లో అదనంగా చెల్లించారని, దానిని రికవరీ చేయాలని డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశిస్తూ కళాశాల విద్యా శాఖ డైరెక్టర్ భరత్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. జీతాలు వెనక్కి ఇవ్వకపోతే ఇకపై చెల్లించాల్సిన జీతాల నుంచి రికవరీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అధికారుల నిర్ణయం కళాశాల విద్యాశాఖలో గందరగోళ వాతావరణం సృష్టిస్తోంది. 2019కు ముందు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు విద్యా సంవత్సరం వరకే జీతాలు ఇచ్చేవారు. అంటే.. సంవత్సరంలో పదిన్నర నెలల జీతాలు అందేవి. ఇంటర్ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల తరహాలో పది రోజుల బ్రేక్‌తో మిగిలిన కాలానికి కూడా తమకు జీతాలు ఇవ్వాలని డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు కోరారు. వారి వినతిని పరిగణనలోకి తీసుకున్న ప్రభు త్వం 2019 నవంబరులో 10 రోజులు మినహా మిగిలిన కాలానికి జీతాలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంటర్ బోర్డుతో సమానంగా అదే సంవత్సరంలో ఏప్రిల్, మే నెలలకు చెల్లించారు. రాష్ట్రవ్యాప్తంగా 700 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉంటే, సుమారు 600 మందికి ఆ ఏడాది ఏప్రిల్, మే నెలలకు సంబంధించి 51 రోజులకు జీతాలు అందాయి. ఆ విద్యా సంవత్సరంలో ఏప్రిల్, మే నెలలకు జీతాలు చెల్లించకూడదని, ఇచ్చినట్టయి తే అదనంగా పరిగణించాలని తాజాగా కళాశాల విద్యా శాఖ స్పష్టం చేసిం ది. దీంతో ఒక్కొక్కరు రూ.60 వేల వరకు చెల్లించాల్సి రావడంతో కాంట్రాక్టు లెక్చరర్లు లబోదిబోమంటున్నారు.
































