చేపల పెంపకానికి ఏర్పాటు చేసిన తొట్టెలు
ఒకవైపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ.. మరోవైపు తొట్టెల్లో చేపలు పెంచుతున్నారు కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన కన్నా విష్ణువర్ధన్.
ఖాళీ సమయంలో అదనపు ఆదాయం పొందడంపై దృష్టి సారించిన అతను ఆధునిక పద్ధతుల్లో చేపలు పెంచాలని నిర్ణయించుకున్నారు. వర్క్ ఫ్రం హోం ద్వారా ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే.. చేపల పెంపకంపై అవగాహన ఏర్పరుచుకున్నారు. సాధారణంగా చెరువుల్లో చేపల పెంపకం అంటే స్థలం, నీరు ఎక్కువ మొత్తంలో ఉండాలి. 10 ఎకరాల్లో పెంచే చేపలను తక్కువ నీటితో రీసర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టం(రాస్) పద్ధతిలో కేవలం 10 సెంట్ల స్థలంలో పెంచవచ్చని తెలుసుకున్నారు. రెండేళ్ల క్రితం 65 సెంట్ల స్థలం అద్దెకు తీసుకొని 25 సెంట్లలో అల్యూమినియంతో చేసిన 12 ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఒక్కో ట్యాంకులో వెయ్యి చేప పిల్లలను సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ పెంచుతున్నారు. ఒక బ్యాచ్ చేపలు అమ్మి లాభం ఆర్జించినా, రెండో బ్యాచ్ వచ్చేసరికి కృష్ణా వరదలతో ట్యాంకులన్నీ మునిగిపోయి చేపలు కొట్టుకుపోయాయి. నష్టం వాటిల్లినా నిలదొక్కుకుని మళ్లీ చేపలు పెంచుతున్నారు. ప్రస్తుతం 40 టన్నుల వరకు పెరిగాయి. చేపలు పెరిగేకొద్దీ గ్రేడింగ్ చేసి పెద్దవాటిని మరో ట్యాంకులోకి మార్చాలని.. లేకపోతే మేత మొత్తం పెద్దచేప తినేస్తుందని విష్ణువర్ధన్ చెబుతున్నారు. ఈ చిట్కా పాటించక చేపల పెంపకందారులు నష్టపోతున్నారని ఆయన తెలిపారు.
45 రోజులు పెరిగిన చేపను చూపుతున్న విష్ణువర్ధన్