కరెంట్ బిల్లు అంటే అందరికీ టెన్షనే. నెలాఖరులో బిల్లు చూసినప్పుడు ఎంత తక్కువ వాడినా ఎక్కువగానే వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఈసారి మాత్రం కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఎందుకంటే, ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక GST డిసిషన్ వల్ల మన ఇంటి కరెంట్ బిల్లులు కొంచెం తగ్గబోతున్నాయి.
ఇప్పటివరకు రిన్యూవబుల్ ఎనర్జీ ఎక్విప్‌మెంట్‌పై 12% GST వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని 5%కి తగ్గించారు. చిన్న మార్పు అనిపించినా, దీని ఇంపాక్ట్ మాత్రం పెద్దదే. ఎందుకంటే పవర్ కంపెనీలు ప్లాంట్ కట్టడం, ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ ఇలా అన్నీ కలిపి ఖర్చులు 13.8% నుంచి 8.9%కి పడిపోయాయి.
అదేంటంటే, రిన్యూవబుల్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ ఖర్చు 4-5% వరకు తగ్గుతుంది. ఈ లాభం నేరుగా మనకు వస్తుంది. అంటే మన బిల్లులో ఒక్క యూనిట్ కరెంట్‌పై 11-14 పైసల వరకు తేడా కనిపించవచ్చు.
ఉదాహరణ: మీ ఇంటి నెలవారీ వినియోగం 300 యూనిట్లు. ఒక్క యూనిట్ కరెంట్‌పై తగ్గింపు 11-14 పైసల వరకు వస్తుంది అని పరిగణిస్తే, మొత్తం ఆదా ఇలా ఉంటుంది: 300 యూనిట్ల × 0.11 రూపాయలు = 33 రూపాయల వరకు, మరియు 300 యూనిట్ల × 0.14 రూపాయలు = 42 రూపాయల వరకు. అంటే, ఈ నెలలో మీ కరెంట్ బిల్లులో సుమారుగా 33 నుండి 42 రూపాయల వరకు తేడా వస్తుంది. చిన్న మొత్తంగా అనిపించవచ్చు, కానీ నెలలుగా చూస్తే, ప్రతి యూనిట్‌పై వచ్చే ఆదా మొత్తం బిల్లులో మీకు తేడా కనిపిస్తుంది.
ఇది ఎవరికీ లాభంగా ఉంటుంది అంటే డిస్కాంలకు లాభం, ఎందుకంటే వారి డిమాండ్ పెరుగుతుంది, కస్టమర్లకు తక్కువ ధరలో విద్యుత్ అందించడానికి అవకాశం లభిస్తుంది. పెద్ద కంపెనీలు కూడా గ్రీన్ ఎనర్జీని ఓపెన్ యాక్సెస్ ద్వారా చవకగా పొందగలుగుతారు. అలాగే, విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడానికి ధైర్యం పొందుతాయి. మొత్తానికి, ప్రభుత్వం తీసుకున్న ఈ GST తగ్గింపు సడలింపు అన్ని సెక్టార్లకీ లాభదాయకంగా ఉంది.
ఒక చిన్న మైనస్ కూడా ఉంది. GST ఇన్‌పుట్ క్రెడిట్ తగ్గిపోవడంతో కొన్ని కంపెనీలకు కొద్దిగా భారమయ్యే అవకాశం ఉంది. కానీ నిపుణుల అంచనా ప్రకారం, మొత్తం పాజిటివ్ ఎఫెక్ట్ ఎక్కువే ఉంటుంది.
కొత్త ప్రాజెక్టులకు బూస్ట్
ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నట్టుగా కొత్త ప్రాజెక్టుల మొత్తం ఖర్చు 4-7% వరకు తగ్గుతుంది. డెవలపర్లకు వచ్చే లాభం కూడా 100-200 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది. దీని వల్ల రిన్యూవబుల్ ఎనర్జీ మాత్రమే కాదు, దేశంలో 73% విద్యుత్ ఇస్తున్న బొగ్గు ఆధారిత ప్రాజెక్టులు కూడా పాజిటివ్ ఇంపాక్ట్ చూడబోతున్నాయి.
ఇంకో పెద్ద మార్పు ఏమిటంటే బొగ్గుపై GST రేటు 5% నుంచి 18%కి పెరిగింది. ఇదంతా వినగానే “అరే, మరి బొగ్గు కరెంట్ ఖరీదు పెరుగుతుందా?” అనిపించొచ్చు. కానీ అదే సమయంలో ప్రతి టన్నుకు ఉండే రూ. 400 సెస్‌ను తొలగించారు. దీని వల్ల బొగ్గుతో తయారు చేసే విద్యుత్ యూనిట్‌కు 10 పైసల కంటే తక్కువ ఖర్చవుతుంది. బొగ్గు నాణ్యత ఆధారంగా ఈ తేడా మారవచ్చు.
ప్రభుత్వం తీసుకున్న ఈ GST మార్పుల వల్ల డిస్కాంల ఫైనాన్షియల్ భారము తగ్గుతుంది. మనకూ తక్కువ బిల్లుతో కరెంట్ అందుతుంది. అంటే ఇక నుంచి ఇంట్లో బల్బు, ఫ్యాన్, ఏసీ ఏదైనా వాడినా “బిల్లు కొంచెం తక్కువ వచ్చింది” అనే హ్యాపీ ఫీలింగ్ రావచ్చు.
































