బిలియనీర్ ఎలాన్ మస్క్, రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నేత, భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామిలకు రానున్న తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలను డొనాల్డ్ ట్రంప్ అప్పగించారు. అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరిలో ప్రారంభమయ్యే తన పదవీకాలానికి కీలకమైన క్యాబినెట్ స్థానాలను ఖరారు చేస్తున్నారు. తాజాగా బిలియనీర్ ఎలాన్ మస్క్, రిపబ్లికన్ పార్టీ కీలక నాయకుడు, భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామిలను తన ప్రభుత్వంలో ప్రభుత్వ సామర్థ్య విభాగానికి (US ‘government efficiency’ department) అధిపతులుగా ఎంచుకున్నారు.
వారికి ఏ బాధ్యతలు?
వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్ లు డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీఓజీ)కి నేతృత్వం వహిస్తారని, అదనపు నిబంధనలను తొలగించడం, వృథా ఖర్చులను తగ్గించడం వంటి బాధ్యతలను వారు నిర్వర్తిస్తారని డొనాల్డ్ ట్రంప్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఈ ఇద్దరు అద్భుతమైన అమెరికన్లు కలిసి, ప్రభుత్వ బ్యూరోక్రసీలోని అనవసర నిబంధనలను తొలగించడానికి, వృథా ఖర్చులను తగ్గించడానికి, ఫెడరల్ ఏజెన్సీలను పునర్వ్యవస్థీకరించడానికి నా పరిపాలనకు మార్గం సుగమం చేస్తారు. సేవ్ అమెరికా ఉద్యమానికి ఈ పనులు అవసరం’’ అని ట్రంప్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఫెడరల్ బ్యూరోక్రసీలో మార్పులు
‘‘అమెరికన్లందరి జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఎలాన్ మరియు వివేక్ ఫెడరల్ బ్యూరోక్రసీలో మార్పులు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా, మా వార్షిక 6.5 ట్రిలియన్ డాలర్ల ప్రభుత్వ వ్యయంలో ఉన్న భారీ వ్యర్థాలు, మోసాలను మేము తరిమికొడతాము’’ అని తదుపరి అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. రిపబ్లికన్ నాయకులు చాలా కాలంగా డీఓజీ అమలు గురించి కలలు కంటున్నారని, ఈ కొత్త విభాగం “మన కాలపు మాన్ హటన్ ప్రాజెక్ట్” లాగా ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ (donald trump) అన్నారు.
రామస్వామి, మస్క్ స్పందన
కొత్త ప్రభుత్వ పోస్టులో తన నియామకంపై ఎలన్ మస్క్ స్పందిస్తూ, ఈ డీఓజీ వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ట్రంప్ ప్రకటన తరువాత, ‘‘నేను ఒహాయోలో పెండింగ్ లో ఉన్న సెనేట్ నియామకం పరిశీలన నుండి ఉపసంహరించుకుంటున్నాను’’ అని వివేక్ రామస్వామి ఎక్స్ లో పోస్ట్ చేశారు. అమెరికా ఫెడరల్ బడ్జెట్ నుంచి కనీసం 2 ట్రిలియన్ డాలర్లను తగ్గించుకోవచ్చని ఎలన్ మస్క్ (elon musk) ట్రంప్ కు మద్ధతుగా ప్రచారం (us presidential elections 2024) చేస్తున్న సందర్భంగా చెప్పారు. ఇది రక్షణతో సహా ప్రభుత్వ ఏజెన్సీ కార్యకలాపాల కోసం కాంగ్రెస్ ఏటా ఖర్చు చేసే మొత్తాన్ని మించిపోతుందన్నారు. ఇందుకు సామాజిక భద్రత, మెడికేర్ వంటి కొన్ని ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో కోతలు అవసరమన్నారు.