ఏపీ సర్కార్ పై ఉద్యోగుల సమాఖ్య ఫైర్..! 22 వేల కోట్ల బకాయి, 9 హామీల అమలేదీ ?

పీలో ఉద్యోగులకు గత ఎన్నికల్లో కూటమి సర్కార్ ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఆరోపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంకా హామీలపై మౌనంగా ఉండిపోతున్నారని, ముఖ్యంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన 22 వేల కోట్ల బకాయిలపైనా స్పందించడం లేదని సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి విమర్శించారు.


2024 ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఎన్డీఏ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య విమర్శించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క ప్రధాన హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తొమ్మిది కీలక వాగ్దానాలను చేసిందని ఆయన గుర్తు చేశారు.

ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారమవుతాయని నమ్ముతూ కూటమి విజయాన్ని పండగలా జరుపుకున్నారని, కానీ ఏడాది దాటినా పరిస్దితిలో మార్పు లేదన్నారు. ఐఆర్, కొత్త పీఆర్సీ అమలు, జీతాలు, పెన్షన్ల సకాలంలో చెల్లింపు, పెండింగ్ బిల్లుల క్లియర్, సీపీఎస్ రద్దు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంక్షేమ పథకాల విస్తరణ వంటి హామీలు నెరవేర్చలేదన్నారు. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకోవడానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా నిర్వహించడం లేదన్నారు.

డీఏ, పదోన్నతులు, సెలవుల నగదు వంటి ప్రాథమిక హక్కులను కూటమి ప్రభుత్వం తిరస్కరిస్తోందని కాకర్ల ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులను బహిరంగంగా అవమానించడం, వారిని గౌరవించడం కంటే అనుమానితులుగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కమిషనర్ రాజీనామా తర్వాత కొత్త పీఆర్సీ కమిషనర్‌ను నియమించడంలో విఫలమయ్యారని, అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం స్వయంగా హామీ ఐఆర్ ప్రకటించలేదని, డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలతో సహా పెండింగ్‌లో ఉన్న రూ.22,000 కోట్ల ఉద్యోగుల బిల్లులను క్లియర్ చేయలేదని ఆరోపించారు.

సీపీఎస్, జీపీఎస్ వ్యవస్థ సమీక్షకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. ప్రతిపాదిత పెన్షనర్ల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. సంక్షేమ పథకాల్ని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలని, లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారానే నియామకాలు చేపట్టాలన్నారు. స్వచ్ఛంద సేవకుల గౌరవ వేతనాన్ని 5 వేల నుంచి 10 వేలకు పెంచుతామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఐఆర్, డీఏ బకాయిల్లో కనీసం 4 వెంటనే ప్రకటించాలని కోరారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.