మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కూలీలకు ఎన్డీయే ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఇకపై ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయటంతో పాటు కూలీల కనీస వేతనాన్ని రూ.
263 నుంచి రూ.300కి పెంచి ఇవ్వటానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం బోగస్ మస్టర్లకు అడ్డుకట్ట వేయటంతో పాటు, పని వేళల్లో మార్పులు చేసి కూలీలకు గిట్టుబాటు వేతనం అందించేందుకు పర్యవేక్షణ చేయనుంది. ఈ విభాగానికి డ్వామాలో కీలకంగా జిల్లా విజిలెన్స్ అధికారిని నియమించింది.
సత్తెనపల్లి డిసెంబరు 25: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కూలీలు ప్రస్తుతం నాలుగు గంటలు పాటు పని చేస్తున్నారు. అదనంగా మరో గంట పెంచేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. ఉపాధి సిబ్బంది, ఏపీడీలు, ఏపీవోలు, ఎంపీడీవోలు నిత్యం మస్టర్లు తనిఖీ చేయాలి. ఈ తరహా చర్యలతో కూలీలకు సగటున మూడు వందల రూపాయల వేతనం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం అందాలంటే ఏయే పనులు ఎంత సమయంలో చేయాల్సి ఉంటుందనే అంశాలపై జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన వేతన పర్యవేక్షణ విభాగం పర్యవేక్షిస్తుంది.
బోగస్ మస్టర్లకు అడ్డుకట్ట…
ఉపాధి పనుల్లో ఇప్పటికే బోగస్ మస్టర్ల బాగోతం నడుస్తుంది. కూలీలు పనికి రాకపోయినా హాజరైనట్టు కొందరు సిబ్బంది మస్టర్లు వేసి వేతనాలు స్వాహా చేస్తున్నారు. వేతన దినాలు దుర్వినియోగం కావటంతో పాటు పనులకు హాజరైన కూలీలకు పూర్తిగా వేతనం అందటం లేదు. అక్రమాలు అరికట్టడానికి జిల్లా స్థాయిలో పర్యవేక్షించే జిల్లా విజిలెన్స్ అధికారి సమన్వయం చేస్తారు.
నిబంధనలు ఇవే..
ఉపాధి కూలీలకు కనీస వేతనం పెరగటానికి ప్రభుత్వం నిబంధనలు విధించింది. నిధానంగా పనుల గుర్తింపు పని ప్రదేశానికి అనుగుణంగా చేపట్టాలి. ముందస్తుగా అంచనాలు తయారు చేయాలి. నేల స్వభావం, కూలీలు పని చేయటానికి అనువుగా ఉండేలా గుర్తించాలి. జిల్లాను యూనిట్‌గా తీసుకొని పనులు కల్పించాలి. పని వేళల్లో మార్పులు చేయాలి. సాంకేతిక సహాయకులు నిత్యం పర్యవేక్షించాలి. ఏపీడీ, ఏపీవో, ఎంపీడీవోలు మస్టర్లు తనిఖీ చేయాలి. కూలీలు చేసే పని వేళలు, కొలతలు పారదర్శకంగా లెక్కించాలి. వేతనాల రసీదులు కచ్చితంగా ఇవ్వాలి.
లక్ష్యానికి అనుగుణంగా పని వేళలు
జాబ్ కార్డు ఉన్న వారందరికీ దినసరి వేతనం రూ.300 అందేలా చూస్తాం. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉపాధి కూలీల పని వేళలు పెంచాలి. రోజుకు నాలుగు గంటలు పని చేసే కూలీలు ఐదు గంటల పాటు చేస్తే కూలీ గిట్టుబాటు ఆవుతుంది. వేతన పెంపుపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించాం. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో 1,73,549 కూలీలు నమోదయ్యారు. 99,324 మంది ఉపాధి హామి పథకంలో పనులు చేస్తున్నారు.