సైఫ్‌పై మర్డర్ ఎటాక్.. నేరస్థుల సింహస్వప్నం దయానాయక్ ఎంట్రీ, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ చేతికి కేసు

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్‌పై హత్యాయత్నం దాడి కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దూకారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో నిందితులు ఎవరు?


ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే విషయాలపై ముంబై పోలీసులు దృష్టిపెట్టారు. జనవరి 16వ తేదీ గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో సైఫ్‌పై ఇంట్లోకి ప్రవేశించిన చొరబాటుదారుడు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బాలీవుడ్ సినీ పరిశ్రమనే కాకుండా యావత్ సినీ పరిశ్రమను ఉలిక్కి పడేలా చేసింది. అయితే ఈ కేసును ఛేదించడానికి ముంబై ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు దయా నాయక్ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారంపై అందరి దృష్టిపడింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే…

అయితే అగంతకుడి చేతిలో పదునైన ఆయుధం ఉండటంతో ఆందోళనకు గురైన సైఫ్ తన కుటుంబాన్ని, సిబ్బందిని రక్షించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో తన ఫ్యామిలీని అక్కడి నుంచి సురక్షితంగా ఉండే గదిలోకి పంపించే క్రమంలో వెనుక నుంచి అగంతకుడు కత్తితో వెన్నుముక ప్రాంతంలో పొడిచాడు. ఈ దాడిలో దేవర యాక్టర్ శరీరంపై సుమారు ఆరు గాయాలు అయ్యాయి అని లీలావతీ వైద్యులు వెల్లడించారు.

అయితే ముంబైని వణికించిన హై ప్రొఫైల్ ఎటాక్ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్‌గా తీసుకొన్నారు. తమకు సవాల్‌గా నిలిచిన ఈ దాడి ఘటనపై ఇప్పటికే పలు కోణాల్లో విచారణ, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ప్రముఖ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, నేరస్థులకు సింహస్వప్నం దయానాయక్‌కు అప్పగించారు. దాంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ కేసు దర్యాప్తును ఎలా ముగిస్తాడో అనే విషయం క్రేజీగా మారింది.

సైఫ్ నివాసంలోకి వెళ్లిన దయా నాయక్ తనదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. అన్ని ప్రాంతాలను కలియదిరుగుతూ కనిపించారు. ఫోన్‌లో అధికారులకు సమాచారం అందిస్తూ బిజీగా కనిపించారు. ఫోరెన్సిక్ టీమ్, క్రైమ్ బ్రాంచ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ హడావిడిగా ఉన్నారు. ఆయన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన అభిమానులు జోష్‌తో వాటిని షేర్ చేస్తున్నారు.

కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన దయా నాయక్ 1995 సంవత్సరంలో బాంబే పోలీసు విభాగంలో చేరారు. జుహు పోలీస్ స్టేషన్‌లో ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. అదే ఏడాది డిసెంబర్ 31వ తేదీన తొలి ఎన్‌కౌంటర్ చేయడంతో ఆయన పేరు ముంబై నేర ప్రపంచంలో మార్మోగింది. పదుల సంఖ్యలో నేరస్థులను ఎన్‌కౌంటర్ చేశాడు. అయితే అవినీతి ఆరోపణలపై ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. సంపాదనకు మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై కేసులు నమోదు అయ్యాయి. ఆయన జీవితంలో పలు రకాల వివాదాలు ఉన్నాయి.