నవంబరు 3 నుంచి మూతపడనున్న ఇంజినీరింగ్‌ కాలేజీలు! కారణం ఇదే

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వారాల క్రితం ప్రైవేట్‌ కాలేజీలు బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంతలో సర్కార్ కల్పించుకుని ఎలాగోలా సర్ధిచెప్పడంతో బంద్‌ విరమించాయి.


అయితే ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమన్యాలు గుర్రు మంటున్నాయి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు ప్రకటన వెలువరించాయి.

లేదంటే నవంబరు 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు బంద్‌ పాటిస్తామని ప్రైవేట్‌ కళాశాలల సమాఖ్య తెలిపింది. ఈ మేరకు అక్టోబర్ 22న ప్రభుత్వానికి నోటీసు అందజేస్తామని పేర్కొంది. అక్టోబర్‌ 25న సమాఖ్య కోర్‌ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించి, విద్యార్థి సంఘాలతో చర్చిస్తామని వెల్లడించింది. ఇక అక్టోబర్‌ 26న సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని, నవంబరు 1వ తేదీ నాటికి అన్ని పార్టీల నేతలతో కలిసి సమావేశం జరపాలని నిర్ణయించారు.

కాగా పెండింగ్‌ బకాయిలపై సెప్టెంబర్‌ 15 నుంచి కాలేజీలు బంద్‌ చేస్తామని గతంలో ప్రైవేటు కాలేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో అప్పట్లో రెండు రోజుల పాటు కాలేజీలు తెరచుకోలేదు. అయితే విడతల వారీగా ఫీజులు చెల్లిస్తామని సర్కార్‌ హామీ ఇవ్వడంతో బంద్‌ను విరమించాయి. ఇందులో భాగంగా సెప్టెంబరు నెలలో రూ.600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బాకీలను చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తొలుత రూ.600 కోట్లను చెల్లించి, మిగిలిన బకాయిలను దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని అప్పట్లో పేర్కొంది. అయితే దీపావళి వచ్చినా ఇంకా నిధులు మంజూరు చేయకపోవడంతో కాలేజీల యాజమన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో బంద్ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వెల్లడించాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.