తగ్గనున్న అధిక పెన్షన్…ఈపీఎఫ్ఓ స్పష్టత ఇస్తుంది!

అధిక పింఛను లెక్కింపు విధానం పై ఈపీఎఫ్వో స్పష్టత ఇచ్చింది. తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్ లో భారీగా కోత పడనుంది.


అధిక పింఛను అర్హత లేని ఈపీఎఫ్వో పెన్షనర్లకు వర్తింపచేస్తున్న లెక్కింపు విధానాన్నే..అధిక పింఛను అర్హులకు అమలు చేయనున్నట్లు వెల్లడించింది.

ఉద్యోగుల పెన్షన్ స్కీం పేరా -12 లోని నిబంధనల ప్రకారం..2014 సెప్టెంబర్ కు ముందు సర్వీసుకు పార్ట్-1, 2014 సెప్టెంబర్ నుంచి పదవీ విరమణ వరకు పార్ట్ 2 కింద లెక్కించి తుది పింఛను ఖరారు చేయనుంది. ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్వో వివరించింది.

ఈపీఎఫ్వో పింఛను విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీని పై ఆదేశాలు జారీ చేశారు. పార్ట్-1, పార్ట్ -2 కింద లెక్కించడంతో 30 శాతానికి పైగా పింఛను కోత పడనుంది. గరిష్ఠ వేతన పరిమితి రూ.6,500 నుంచి రూ.15 వేలకు పెంచినప్పుడు ఈపీఎఫ్వో ఈ నిబంధనను తెరపైకి తెచ్చింది.

2014 సెప్టెంబర్ 1 కి ముందు చివరి ఏడాది సగటు వేతనం, మొత్తం సర్వీసు కలిపి పింఛను లెక్కించే విధానం అమల్లో ఉండేది. గరిష్ఠ వేతన పరిమితి పెంపు తరువాత చివరి ఐదేళ్ల సగటు తో పింఛను ఖరారు చేసి పార్ట్ -2 గా లెక్కిస్తోంది. ఈ రెండూ కలిపి పూర్తి పింఛనుగా ఇస్తోంది.

పింఛను నిధికి నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ఠ వేతన పరిమితి ప్రస్తావన లేనందున పార్ట్ 1,2 కాకుండా 2014 సెప్టెంబర్ 1 కి ముందు ఉన్న నిబంధన అమలు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయాల అధికారులు నిబంధనలకు లోబడి వెంటనే దరఖాస్తుల పరిష్కారాన్ని వేగంగా చేపట్టాలని ఈపీఎఫ్వో కేంద్ర కార్యాలయం సూచించింది.

అధిక పింఛను ఖరారైన తరువాత పింఛను దారు అందుకునే పెన్షన్ బకాయిల పై టీడీఎస్ వర్తిస్తుందని వెల్లడించింది.

కోత ఎలా ఉండనుందంటే..

ప్రభుత్వ రంగ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి 1999లో సర్వీసులో చేరి 2021 లో పదవీ విరమణ చేశారనుకుందాం. బోనస్ రెండేళ్లతో కలిపి 24 సంవత్సరాల సర్వీసు అనుకుంటే..2014 ఏడాది నాటికి సగటు వార్షిక వేతనం రూ.22,000 గా ఉంది. పదవీ విరమణ నాటికి చివరి ఐదు సంవత్సరాల వేతన సగటు రూ. 40 వేలు. చివరి ఐదేళ్ల వేతన సగటుతో పింఛను లెక్కిస్తే రూ. 13,714 చేతికి అందాలి.

కానీ పార్ట్-1, పార్ట్ -2 కింద లెక్కించడంతో పార్ట్ -1 కింద రూ.5,342 , పార్ట్ -2 కింద రూ. 4,000 మొత్తం కలిపి రూ. 9,342 గా ఖరారవుతుంది. అంటే నెలకు రూ.4,372 పింఛను కోత పడుతుంది.