EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త… ఆ డబ్బు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఖాతాల్లో చాలాకాలంగా క్లెయిమ్ చేయకుండా ఉన్న డిపాజిట్లను తిరిగి చందాదారులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి క్లెయిమ్ ఫారాలు లేకుండానే, ఈ సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 31 లక్షల మందికి పైగా ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది.


కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈపీఎఫ్ఓ వద్ద ప్రస్తుతం 31.86 లక్షల ఖాతాలు నిరుపయోగంగా (ఇన్‌ఆపరేటివ్) ఉన్నాయని, వాటిలో మొత్తం రూ.10,903 కోట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. మూడేళ్లకు పైగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను నిరుపయోగంగా పరిగణిస్తారు. వీటిలో కొన్ని ఖాతాలు 20 ఏళ్లకు పైబడినవి కూడా ఉన్నాయి.

ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి త్వరలోనే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. తొలి దశలో భాగంగా, 7.11 లక్షల ఖాతాదారులకు ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా రూ.1,000 లోపు మొత్తాలు ఉన్న ఖాతాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈపీఎఫ్ఓ వద్ద ఉన్న ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా ఈ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా జమ చేస్తారు. దీనివల్ల డాక్యుమెంట్ల సమర్పణ భారం తప్పుతుంది.

పైలట్ ప్రాజెక్టు విజయవంతమైన తర్వాత, మిగిలిన 25 లక్షల ఖాతాదారులకు కూడా ఈ ఆటోమేటిక్ రీఫండ్ విధానాన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. చిన్న మొత్తాల కోసం కూడా క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేసి, ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట కల్పించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.